Japan Nanmadol Typhoon:
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..
జపాన్ మెటెరాలాజికల్ ఏజెన్సీ (JMA) కగోషిమా ప్రాంతానికి "స్పెషల్ వార్నింగ్" ఇచ్చింది. తుపాను ముంచుకొస్తున్న సమయంలో ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఇప్పుడు అక్కడ అలాంటి వాతావరణమే నెలకొంది. దశాబ్దాలకోసారి ఎప్పుడో కానీ...ఇలాంటి హెచ్చరికలు రావు. ఇప్పుడు ముప్పు ఉండటం వల్ల ప్రజల్ని ఇలా ముందుగానే అప్రమత్తం చేశారు. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. Typhoon Nanmadol కారణంగా...నైరుతి జపాన్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. కనీసం 30 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే...అక్కడ తుఫాను ప్రభావం కనిపిస్తోంది. కగోషిమా సహా పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు 25,680 ఇళ్లకు విద్యుత్ అందటం లేదు. లోకల్ ట్రైన్‌లు నిలిచి పోయాయి. ఫ్లైట్‌లూ రద్దయ్యాయి. మిగతా ప్రజారవాణా సర్వీసులనూ నిలిపివేశారు. ప్రమాదకర స్థాయిలో గాలులు వీస్తుండటం వల్ల JMA హెచ్చరికలు జారీ చేసింది. ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది అని భావిస్తున్నారు స్థానిక అధికారులు. ఇది చాలా ప్రమాదకరమైన టైఫూన్ అని వివరిస్తున్నారు.
బలంగా వీస్తున్న గాలులు..
ఇప్పుడు వీస్తున్న గాలి వేగం ఇలాగే కొనసాగితే...వేలాది ఇళ్లను నేలమట్టం అయ్యే ప్రమాదముంది. ఇప్పటికే 29 లక్షల ఇళ్లకు హెచ్చరికలు జారీ చేసి వెంటనే ఖాళీ చేయాలని అక్కడి ప్రజలకు చెప్పారు. ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. కగోషిమా స్థానిక అధికార యంత్రాంగమూ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి 8,500 మంది పౌరుల్ని వేరే ప్రాంతాలకు తరలించారు. వారికి ప్రత్యేక ఆవాసాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకుని నిలబడగలిగే ఇళ్లలోనూ వీళ్లకు ఆశ్రయం కల్పిస్తున్నారు. బలమైన గాలులు వీచే సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులు వివరిస్తున్నారు. దృఢంగా ఉండే బిల్డింగ్‌ల్లోకి వెళ్లాలని, కిటికీల పక్కన నిలుచోకూడదని ప్రజలకు సూచిస్తున్నారు. బులెట్ ట్రైన్స్‌తో సహా మిగతా లోకల్ ట్రైన్ సర్వీసులనూ రద్దు చేశారు. 510 విమానా సర్వీసులనూ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. గంటకు 252 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను దూసుకొచ్చే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జపాన్ నిత్యం ఇలా తుఫానుల్లో చిక్కుకుంటూనే ఉంది. ఏడాదికి కనీసం 20 తుపానులు ఇక్కడ నమోదవు తున్నట్టు అంచనా. భారీ వర్షాల కారణంగా వరదలూ ముంచెత్తుతున్నాయి. 2019లో Typhoon Hagibis జపాన్‌ను అతలాకుతలం చేసింది. రగ్‌బీ వరల్డ్ కప్ జరిగిన సమయంలో ముంచెత్తున ఈ తుఫాను దాదాపు 100 మందిని బలి తీసుకుంది. 2018లో వరదల కారణంగా 200 మంది ప్రాణాలు కోల్పోయారు. వాతవారణంలో అనూహ్య మార్పుల కారణంగానే...జపాన్ ఇలా ప్రకృతి విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వేడి గాలులు, కరవు, వరదలు ఇలా అన్ని సమస్యలకూ కారణం అదే అని వివరిస్తున్నారు.
Also Read: China Phones: దేశం నుంచి తరలిపోతున్న చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు!