Bin Laden Photo in Office: ఎవరైనా ఆఫీస్‌లలో గొప్ప వ్యక్తుల ఫోటోలు పెట్టుకుంటారు. మరీ భక్తులైతే దేవుళ్ల ఫోటోలు పెట్టుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లో ఓ అధికారి ఒసామా బిన్‌లాడెన్ ఫోటో పెట్టుకున్నాడు. అందుకు ఫలితం అనుభవిస్తున్నాడు. 


యూపీలోని దక్షిణాంచల్ విద్యుత్ విత్రన్ నిగమ్ లిమిటెడ్ సంస్థలో సబ్ డివిజనల్ ఆఫీసర్‌గా పని చేస్తున్న రవీంద్ర ప్రకాశ్ గౌతమ్ ఆఫీస్‌లో బిన్ లాడెన్ ఫోటో పెట్టుకున్నాడు. పైగా దాని కింద ప్రపంచంలోనే అత్యుత్తమ జూనియర్ ఇంజనీర్ అంటూ నోట్‌ కూడా రాశాడు. 
ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవటం వల్ల సీనియర్ అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే ఆ ఉద్యోగిని సస్పెండ్ చేశారు. మేనేజింగ్ డైరెక్టర్ ఆ ఉద్యోగిని సస్పెండ్ చేసినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఆఫీస్‌లో  నుంచి  బిన్ లాడెన్ ఫోటోని తొలగించారు.  
ఇంత జరిగినా ఆ ఉద్యోగి వైఖరిలో ఏ మార్పూ రాలేదు. "నచ్చిన వ్యక్తిని ఆరాధించటం తప్పేమీ కాదు. అందరూ అదే కదా చేసేది. ఆఫీస్‌లో నుంచి ఫోటో తీసేసినా నేనేం బాధ పడటం లేదు. నా దగ్గర ఇంకా చాలా కాపీలు ఉన్నాయి" అంటూ ఆ ఉద్యోగి వ్యాఖ్యానించటం కొసమెరుపు. 


లాడెన్‌ను ఇలా మట్టుబెట్టారు..


అల్‌ఖైదా వ్యవస్థాపకుడు, కరడుగట్టిన తీవ్రవాది ఒసామా బిన్‌లాడెన్‌ ప్రపంచాన్నే గడగడలాడించాడు. న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్స్‌ని కూల్చి వేయటం అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఈ ఘటనలో దాదాపు 3 వేల మంది పౌరులు మృతి చెందారు. ఈ దాడి తరవాతే అగ్రరాజ్యం బిన్‌లాడెన్‌ను హతమార్చాలని నిర్ణయించుకుంది. అలా అని తొందర పడలేదు. చాలా వ్యూహాత్మకంగా లాడెన్‌ ఎక్కడున్నాడో కనుక్కుంది. ఇందుకోసం యూఎస్ నావీ సేల్ బృందం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఇస్లామాబాద్‌కు సమీపంలోని అబొట్టాబాద్‌లోని ఓ భవంతిలో దాక్కుని ఉన్న లాడెన్‌ ఆచూకీ కనుగొని 2011 మే 2వ తేదీన  మట్టుబెట్టింది అమెరికా. 


అల్‌ఖైదా-ప్రమాదకరమైన సంస్థ


లాడెన్ నేతృత్వం వహించిన అల్‌ఖైదా సంస్థకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జిహాదీ గ్రూపుగా ముద్ర పడింది. ఈ సంస్థ జెండా పట్టుకుని చాలా మంది ఉగ్రవాదులు జిహాదీ పేరిట మారణహోమం సృష్టించారు. ఎప్పుడైతే లాడెన్ హతమయ్యాడో అప్పటి నుంచి క్రమక్రమంగా ఈ సంస్థ కార్యకలాపాలు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడీ సంస్థ ప్రభావం చాలా వరకు తగ్గిపోయింది. 
కొత్త మిలిటెంట్ గ్రూప్‌లు పుట్టుకొచ్చి ఆ మారణహోమాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ గ్రూప్‌లతో చేయి కలిపి పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తోంది అల్‌ఖైదా. మొత్తానికి యూపీ అధికారి కారణంగా మరోసారి వార్తల్లో నిలిచాడు బిన్‌ లాడెన్.