Mekapati Vikram Reddy Files Nomination: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేష్ దాఖలు చేశారు. అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. నెల్లూరులోని తన ఇంటిలో పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని విక్రమ్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరారు. దివంగత నేత గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం తన రాజకీయ ప్రస్థానంలో తొలి అడుగు వేశారు తమ్ముడు విక్రమ్ రెడ్డి. పెద్ద కొడుకు హఠాన్మరణం, చిన్న కొడుకు రాజకీయ అరంగేట్రంతో వారి తల్లి తీవ్ర భావోద్వాగానికి గురయ్యారు.
అనంతరం జిల్లా మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు వారి వెంట రాగా.. ఆత్మకూరు బయలుదేరారు. ఆత్మకూరు వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, తిరిగి మసీదులో ప్రార్థనలు జరిపారు. అక్కడినుంచి ఆర్డీవో ఆఫీస్ కి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఆత్మకూరు పట్టణంలో ఓపెన్ టాప్ జీప్ లో ఊరేగింపుగా వెళ్లారు విక్రమ్ రెడ్డి.
ఆత్మకూరులోనీ ఆర్డీవో ఆఫీస్ లో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఆయనకు సీఎం జగన్ బీ-ఫామ్ అందజేశారు. వైసీపీ అభ్యర్థిగా ఈరోజు విక్రమ్ రెడ్డి నామినేషన్ వేశారు. ఆర్వో హరేందిర ప్రసాద్ కి ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విజయం మాదే..
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మేకపాటి విక్రమ్ రెడ్డి. ఇప్పటికే ఆయన గడప గడపకు వైసీపీ కార్యక్రమం ద్వారా సగం నియోజకవర్గాన్ని కవర్ చేశారు. పరిచయ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. అన్న గౌతమ్ రెడ్డిపై ఉన్న అభిమానంతోపాటు, వైసీపీ అందిస్తున్న సంక్షేమ పథకాలు కూడా తన విజయానికి దోహదపడతాయని చెప్పారు విక్రమ్ రెడ్డి. మరోవైపు విక్రమ్ రెడ్డికి పోటీగా ప్రధాన పార్టీలేవీ ఇంకా తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. కనీసం ప్రచారంలో కూడా వారు ముందు లేరు. దీంతో వార్ వన్ సైడేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఆత్మకూరు ఉప ఎన్నికల షెడ్యూల్
నామినేషన్ల ప్రారంభం మే 30, 2022
నామినేషన్ల చివరి తేదీ జూన్ 6, 2022
ఎన్నికల తేదీ 23 జూన్, 2022
కౌంటింగ్, ఫలితాల ప్రకటన 26 జూన్, 2022....