UP News:
నీలాచల్ ఎక్స్‌ప్రెస్‌లో దుర్ఘటన..
ఢిల్లీ నుంచి కాన్‌పూర్ వెళ్లే నీలాచల్ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం జరిగింది. విండోసీట్‌లో కూర్చున్న ఓ వ్యక్తి మెడలోకి ఐరన్ రాడ్ దూసుకుపోయి మరణించాడు. కిటికీ అద్దం పగిలిపోయి మరీ రాడ్ లోపలకు దూసుకొచ్చింది. అది నేరుగా ఆ వ్యక్తి మెడను బలంగా ఢీకొట్టింది. మెడలో ఇరుక్కుపోయింది. ఈ దెబ్బకు విలవిలలాడి ఆ బాధితుడు మృతి చెందాడు. ప్రయాగ్‌రాజ్ డివిజన్‌లోని దన్వార్, సోమ్‌నా మార్గ మధ్యలో జరిగిందీ దారుణం. ఉదయం 8.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు రైల్వే అధికారులు తెలిపారు. "జనరల్ కోచ్‌లో ఓ వ్యక్తి కిటికీ వైపు కూర్చున్నాడు. బయట నుంచి ఓ ఐరన్ రాడ్ వచ్చి గట్టిగా గుచ్చుకుంది. అలీఘర్ జంక్షన్ వద్ద ట్రైన్ చాలా సేపు ఆగిపోయింది" అని వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు రైల్వే ట్రాక్‌పై మరమ్మతు పనులు జరుగుతున్నట్టు చెప్పారు. అయితే..దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. మృతుడిని రిషికేష్ డూబేగా గుర్తించారు. జీఆర్‌పీ సిబ్బందికి మృత దేహాన్ని అప్పగించారు. అంతకు ముందు పంజాబ్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ట్రైన్ యాక్సిడెంట్‌లో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. పండ్లు కోసుకునేందుకు పట్టాల మీదకు వచ్చారని, రైలు వస్తుండటాన్ని గమనించకపోవడంవల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
రైలు దిగుతుండగా ప్రమాదం..
ఇవి అనుకోకుండా జరిగిన ప్రమాదాలే అయినా...కొందరు ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. కదులుతున్న రైల్లోకి ఎక్కడం, రైల్లో నుంచి దిగడం ప్రమాదకరం అని రైల్వే స్టేషన్లలో మైక్‌లు పెట్టి మరీ అనౌన్స్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. కదులుతున్న రైలును దిగేందుకు ప్రయత్నించిన మహిళ రైలుకి, ప్లాట్‌ఫామ్‌కి మధ్య ఇరుక్కుపోయింది. ఇది చూసి స్టేషన్‌లో వాళ్లంతా షాక్‌కి గురయ్యారు. ఒక్కసారిగా జనాలు అరవటాన్ని గమనించిన RPF పోలీసులు వెంటనే పరిగెత్తి ఆ మహిళను కాపాడారు. విష్ణుపుర నుంచి నరకటిగంజ్‌కు వెళ్తున్న అంబిష ఖతూన్...ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ట్రైన్ కోసం ఎదురు చూస్తోంది. ప్లాట్‌ఫామ్‌పై బాత్‌రూమ్ లేకపోవటం వల్ల కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్వాలియర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. ఎక్కిన వెంటనే ఉన్నట్టుండి రైలు కదిలింది. ఏం చేయాలో తెలియక వెంటనే అందులో నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే కాలు జారి ప్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కుపోయింది. RPF పోలీసులు తక్షణమే స్పందించకపోయుంటే...తీవ్ర నష్టం జరిగుండేది. RPF పోలీసుల చొరవతో స్వల్ప గాయాలతో బయట పడింది. ప్రస్తుతం ఆమెను సర్దార్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు.