UP Police Panchang: పౌర్ణమి, అమావాస్య, తిథులు, మంచి రోజులు అని సాధారణంగా ఏదైనా శుభకార్యాలకు చూస్తుంటాము. లేదా ఏదైనా మంచి పనులు ప్రారంభించడానికి పంచాంగం చూస్తుంటాము. అయితే ఉత్తరప్రదేశ్‌ లో మాత్రం పోలీసులు కూడా అమావాస్య, పౌర్ణమిలను చూసుకోవాలట. క్రైం కంట్రోల్‌కు పోలీసులకు పంచాంగం సహాయపడుతుందట. అదేంటి దొంగలను పట్టుకోవడానికి, కేసులను ఛేదించడానికి అమావాస్యతో ఏం సంబంధం ఉంటుందనుకుంటున్నారా.. సంబంధం ఉంటుందంట, ఆ విషయాన్ని స్వయంగా యూపీ డీజీపీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ విషయంపై ఆయన సర్క్యులర్‌ కూడా జారీ చేశారు.


ఉత్తర ప్రదేశ్‌లో క్రైమ్‌ రికార్డ్స్‌ను, క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్కింగ్‌ సిస్టమ్స్‌ను పరిశీలించాలని, అమావాస్య రోజులలో, ఆ తర్వాత వారం రోజుల్లో జరిగిన క్రైమ్స్‌పై స్టడీ చేయాలని రాష్ట్రంలో అన్ని జిల్లాల పోలీసు అధికారులకు యూపీ డీజీపీ విజయ్‌కుమార్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. ఈ స్టడీ ద్వారా ఇల్లీగల్‌ యాక్టివిటీస్‌ను నిర్మూలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.  


రాష్ట్రంలో ఎక్కువగా నేర ఘటనలు అమావాస్యకు వారం రోజుల ముందు జరుగుతున్నాయని డీజీపీ తెలిపారు. కృష్ణ పక్షంలో చంద్రుడి వెలుతురు లేని సమయంలో ఘటనలు ఎక్కువగా ఉంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అమావాస్య తర్వాత వారం రోజుల వరకు కూడా క్రైమ్స్‌ ఎక్కువగా నమోదవుతున్నాయని అన్నారు. కాబట్టి ప్రతి నెల ఈ సమయంలో పోలీసులు మరింత అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. అలాగే వీటిపై ప్రతి నెలా రివ్యూ చేయాలని చెప్పారు.


డీజీపీ పోలీసులకు అందించిన రిపోర్ట్‌ ప్రకారం.. ఆగస్టు 1 న పౌర్ణమి ఉందని దీని వల్ల సాయంత్రం 6 గంటల నుంచి ఆగస్టు 2 న ఉదయం 6 గంటల వరకు చంద్రుడి వెలుగు ఉంటుందని దీని వల్ల క్రిమినల్స్‌ బయట తిరగడంలో ఇబ్బంది ఉంటుందని పేర్కొన్నారు. తర్వాత ఆగస్టు 16 న అమావాస్య ఉందని, రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 వరకు చీకటిగా ఉంటుందని దీన్ని క్రిమినల్స్‌ మంచిగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. బాగా చీకటిగా ఉన్న సమయంలో దొంగతనాలు, నేరాలు చేయడానికి అనువుగా భావిస్తున్నట్లు అన్నారు.  


అలాగే ఆయన తర్వాత రాబోయే అమావాస్య రోజులను కూడా గుర్తు చేసి ఆ రోజుల్లో పోలీసులు అలర్ట్‌గా ఉండాలని చెప్పారు. సెప్టెంబరు 14 న, ఆ తర్వాత అక్టోబరు 14 న అమావాస్య వస్తుందని చెప్పారు. అమావాస్యకు వారం ముందు, వారం తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. అంతేకాకుండా ఈ సర్క్యులర్‌ పోలీసులకు మాత్రమే కాదని, సాధారణ ప్రజలు కూడా అని చెప్పారు. ప్రజలు కూడా అమావాస్య సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని, దొంగల భయం ఆ రోజుల్లో ఎక్కువగా ఉందని అన్నారు. పెట్రోలింగ్‌ నిరంతరంగా జరుగుతుంటే నేరాలు అరికట్టవచ్చని డీజీపీ వెల్లడించారు.


పలు క్రైమ్‌ గ్యాంగ్స్‌ కూడా అమావాస్య రోజుల్లోనే దాడులు చేస్తున్నాయని హెచ్చరించారు. కొన్ని గ్యాంగ్స్‌ వాళ్లు అమావాస్య ముందు నేరాలు చేసి తర్వాత తమ దైవానికి జంతువులను బలి ఇస్తున్నాయని తెలిపారు. పార్డి, బవారియా లాంటి దాడులు చేసే గ్యాంగ్‌లు కూడా అమావాస్య రోజునే ఎంచుకుంటున్నాయని స్పష్టంచేశారు. వీళ్లు పౌర్ణమి రోజుల్లో దాక్కొని ఉండి, అమావాస్య సమయాల్లోనే బయటకు వస్తారని చెప్పారు.