ఉత్తర్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ప్రచారపర్వం ఇప్పటికే మొదలైంది. 403 స్థానాలు ఉన్న ఈ ఎన్నికలను అన్నీ పార్టీలు చాలా కీలకంగా తీసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్ యాదవ్, మాయావతి, ఎఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. అయితే అధికార భాజపా మాత్రం ఇప్పటివరకు ప్రచారం మొదలుపెట్టలేదు. మరి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర భాజపా ప్లాన్ ఏంటి?


ఏబీపీ సమాచారం ప్రకారం.. భాజపా ప్రచార శంఖారావాన్ని ఈ నెల 14న ప్రధాని నరేంద్ర మోదీ పూరించనున్నారు. సెప్టెంబర్ 14న అలీగఢ్ లోని రాజ మహేంద్ర సింగ్ యూనివర్సిటీకి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. సెప్టెంబర్ 26న లఖ్ నవూలో జరిగే అర్బన్ కాన్ క్లేవ్ కు మోదీ హాజరుకానున్నారు. ఈ ఏడాది దీపావళికి ప్రధాని మోదీ.. అయోధ్య వెళ్తున్నారని సమాచారం. రామమందిర నిర్మాణ శంకుస్థాపన తర్వాత మోదీ ఇప్పటివరకు అయోధ్య వెళ్లలేదు. ఎన్నికల నేపథ్యంలో ఈసారి మోదీ.. అయోధ్య పర్యటన భాజపాకు కలిసివస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 





ఇప్పటికే వచ్చే ఏడాది జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇన్ ఛార్జిల పేర్లను ప్రకటించింది భాజపా. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను.. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జిగా నియమించింది. అనురాగ్ ఠాకూర్, సరోజ్ పాండే, అర్జున్ రామ్ మేఘవాల్ లను కో-ఎలక్షన్ ఇంఛార్జ్ లుగా ప్రకటించింది.


Also Read: TN Ganesh Chaturthi 2021: చవితి వేడుకలు రద్దు చేసినా సీఎంపై ప్రశంసల జల్లు


ఎస్పీ, బీఎస్పీ జోరుగా..


భాజపాను యూపీలో గద్దె దించడమే లక్ష్యంగా ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. కరోనా కట్టడిలో వైఫల్యం, మహిళలపై అత్యాచారాలు సహా మరిన్ని సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై మాయవతి, అఖిలేశ్ యాదవ్ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా యూపీ ఎన్నికలపై భారీ ఆశలే పెట్టుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కొన్ని నెలలుగా యూపీ ఎన్నికలపైనే దృష్టి పెట్టారు. పార్టీని మళ్లీ పోటీలో నిలబెట్టేలా కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు.  మరి ఈసారి భాజపాకు గట్టి పోటీ ఎదురవుతుందో లేక మళ్లీ కాషాయ జెండా రెపరెపలాడుతుందో చూడాలి.


Also Read: Third Front : దేశంలో "ధర్డ్ ఫ్రంట్" ప్రయత్నాలు ! 25న హర్యానాలో తొలి సమావేశం !