తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్ కే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గణేశ్ విగ్రహాలు తయారు చేసే కళాకారులకు ఒక్కొక్కరికి రూ.5వేల ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్రంలోని 3 వేల మంది దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా వినాయక చవితికి బహిరంగ వేడుకలను రద్దు చేస్తూ ఇటీవల సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు.
ఆర్థిక సాయం..
వినాయక చవితి వేడుకలను రద్దు చేయడం వల్ల దీన్నే నమ్ముకొని బతికే ఎన్నో వేలమంది కళాకారులు ఆందోళన చెందారు. అయితే వారికి రూ.5 వేలు సాయం చేసి ఆదుకుంటామని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. గణేశ్ చతుర్థిని బహిరంగంగా జరుపుకునేలా అనుమతి ఇవ్వాలని అసెంబ్లీలో భాజపా డిమాండ్ చేసింది. దీనిపై స్పందిస్తూ సీఎం కీలక ప్రకటన చేశారు.
స్టాలిన్ నిర్ణయంపై విగ్రహ తయారీదారులు హర్షం వ్యక్తం చేశారు. వేడుకలు రద్దు చేసినప్పటికీ తమ గురించి ఆలోచించి ఈ సాయం ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
వేడుకలు రద్దు..
కరోనా వ్యాప్తి కారణంగా బహిరంగ ప్రదేశాల్లో గణేశ్ విగ్రాహాలు పెట్టడం, నిమర్జన కార్యక్రమాలను రద్దు చేసింది తమిళనాడు సర్కార్. పండుగను ఇంటివద్దే జరుపుకోవాలని సూచించింది. ఒక్కొక్కరుగా వెళ్లి విగ్రహాలను నిమర్జనం చేయాలని పేర్కొంది. చెన్నై వాసులు.. బీచ్ లో విగ్రహాలు నిమర్జనం చేయరాదని స్పష్టం చేసింది.
కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న కారణంగా పండుగలను బహిరంగంగా జరుపుకోకుండా చూడాలని కేంద్ర హోంశాఖ ఇటీవల రాష్ట్రాలకు తెలిపింది. సెప్టెంబర్ 30 వరకు ఈ ఆదేశాలు పాటించాలని వెల్లడించింది. ఇందుకోసమే సెప్టెంబర్ 10న వచ్చిన వినాయకచవితి వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.