UP Election 2022: భాజపాకు 4 గంటల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు బైబై.. సైకిల్ ఎక్కి రయ్‌ రయ్.. రసవత్తరంగా యూపీ రాజకీయం!

ABP Desam   |  Murali Krishna   |  12 Jan 2022 04:21 PM (IST)

ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్దీ ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు భాజపాకు బైబై చెప్పారు. దీంతో భాజపా ఆలోచనలో పడింది.

భాజపాకు బైబై

ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా ఉంది. ఓవైపు ఒపీనియన్ పోల్స్, సర్వేలు.. మరోసారి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భాజపా అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. కానీ మరోవైపు భాజపా నుంచి సమాజ్‌వాదీ పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరిగిపోతున్నాయి. 4 గంటల వ్యవధిలో ఏకంగా ఒక మంత్రి సహా నలుగురు భాజపా ఎమ్మెల్యేలు అఖిలేశ్ యాదవ్ చెంతన చేరారు. దీంతో భాజపాలో గుబులు మొదలైంది. అసలు ఈ వలసలకు కారణమేంటి?

వలసల పర్వం..

మంగళవారమే.. యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌లోని కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ తన పదవికి రాజీనామా చేసి అఖిలేశ్ యాదవ్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అది జరిగిన గంటల వ్యవధిలోనే మరో నలుగురు ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీ బాట పట్టారు. రోషన్ లాల్ వర్మ, బ్రిజేష్ ప్రజాపతి, భగవతి సాగర్, వినయ్ శాక్య తాము రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీరంతా స్వామి ప్రసాద్ మౌర్యకు సన్నిహితులే.

స్వామి ప్రసాద్ మౌర్య ఓబీసీ వర్గానికి చెందిన బలమైన నాయకుడు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి 2016లో ఆయన భాజపాలో చేరారు. అప్పటి నుంచి అఖిలేశ్ యాదవ్ పార్టీకి ఓబీసీ ఓటర్లను దూరం చేసే ప్రణాళికల్లో ముఖ్యపాత్ర పోషించారు మౌర్య.

ఇప్పుడు రాజీనామా చేసిన నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు మౌర్యలానే బీఎస్పీ నుంచి భాజపాకు చేరారు. ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

అదే కారణం..

తాను రాజీనామా చేయడానికి దళితులపై భాజపా చిన్నచూపు వైఖరే కారణమని మౌర్య రాజీనామా పత్రంలో పేర్కొన్నారు.

దళితులు, వెనుకబడిన వర్గాలు, రైతులు, నిరుద్యోగ యువత, చిన్న వ్యాపారులను భాజపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఈ కారణంగానే నేను యోగి ఆదిత్యనాథ్ మంత్రి మండలికి రాజీనామా చేశాను. నా రాజీనామా.. భాజపాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో 2022 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తేలుతుంది.                                            "
- స్వామి ప్రసాద్ మౌర్య   
 
ఆయనే కారణమా?
 
యోగి ఆదిత్యనాథ్‌ నాయకత్వంపై యూపీ భాజపాలో అసంతృప్తి ఉందని ఇప్పటికే పలువురు నాయకులు బహిరంగంగానే చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా రాజీనామాలతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రెండు నెలల ముందే యోగి ఆదిత్యనాథ్ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మౌర్య ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కానీ దాన్ని అధిష్ఠానం పెద్దగా పట్టించుకోలేదు.
 
ఇప్పుడు మౌర్యతో పాటు రాజీనామా చేసిన మరో నలుగురు ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యను డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు అమిత్ షా అప్పగించినట్లు తెలుస్తోంది.
 
డిప్యూటీ సీఎం..
 
మౌర్య రాజీనామాపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యనే మొదటగా స్పందించారు.
 
స్వామి ప్రసాద్ మౌర్య ఎందుకు పార్టీని వీడారో నాకు తెలియడం లేదు. కానీ నేను ఆయనకు చెప్పేది ఒక్కటే. పార్టీని వీడద్దు.. చర్చిద్దాం రండి. తొందరపాటు నిర్ణయాలు మంచివికావు.                                                           "
-కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ డిప్యూటీ సీఎం

కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యలపై స్వామి ప్రసాద్ మౌర్య కూడా ఘాటుగా స్పందించారు.

ఈ విషయం గురించి కేశవ్ ప్రసాద్ మౌర్య ముందే ఎందుకు ఆలోచించలేదు? ఆయనకు నేను ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చాను? ఇప్పుడు అందరూ చర్చిద్దామనే అంటారు. కానీ అవసరమైనప్పుడు ఎప్పుడూ కనబడరు.                                    -  స్వామి ప్రసాద్ మౌర్య 

చిగురించిన ఆశలు..

ఇలా ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడటం భాజుపాను ఆశ్చర్యపరచగా సమాజ్‌వాదీ పార్టీలో మాత్రం ఆశలు చిగురింప జేసింది. ఇప్పటికే అఖిలేశ్ యాదవ్‌కు మద్దతుగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. 

యూపీలో మార్పు రాబోతుంది. ఈరోజు మౌర్య రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 13 మంది ఎమ్మెల్యేలు వెంట ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా చాలా మంది భాజపాను వదిలేస్తారు.                                        - శరద్ పవార్, ఎన్‌సీపీ అధినేత

Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!

Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 12 Jan 2022 03:48 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.