ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ( Andhra Pradesh ) ఉదయం ఎంతో రిలీఫ్ ఇచ్చిన కేంద్ర హోంశాఖ సాయంత్రానికి షాకిచ్చింది. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం కోసం నియమించిన త్రిసభ్య కమిటీ చర్చల ఎజెండాను ఉదయం కేంద్ర హోంశాఖ ఖరారు చేసింది. అందులో మొత్తం తొమ్మిది అంశాలపై చర్చ జరపాలని అనుకుంటే అందులో ఎనిమిదో అంశంగా ప్రత్యేకహోదా ఉంది. దీంతో ఏపీ ప్రభుత్వం సంతృప్తి పడింది. సీఎం జగన్ ( CM Jagan ( కృషి ఫలించిందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala ) సహా అనేక మంది వైఎస్ఆర్‌సీపీ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. చర్చలు ఓ అడుగేనని ప్రత్యేకహోదా సాధిస్తామన్నారు. 


అయితే సాయంత్రానికి కేంద్ర హోంశాఖ చర్చల ఎజెండాలో మార్పులు చేస్తూ సర్క్యూలర్ విడుదల చేసింది. ఈ సారి జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రత్యేకహోదా ( No Special Status ) అంశం ఎక్కడా కనిపించలేదు. దీంతో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలినట్లయింది. అయితే ఒక్క ప్రత్యేకహోదా  మాత్రమే కాదు మరో మూడు అంశాలను కూడా చర్చల టాపిక్‌ నుంచి తప్పించారు. ఉదయం తొమ్మిది అంశాలపై చర్చ ఉంటుందని చెప్పగా తాజాగా జారీ చేసిన సర్క్యూలర్‌లో కేవలం ఐదు అంశాలపై మాత్రమే చర్చ ఉంటుందని తెలిపింది. ప్రత్యేక హోదా, రెవిన్యూ లోటు  భర్తి, పన్ను రాయితీలు, వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయింపు అంశాలను తప్పించారు. 


నిజానికి కేంద్ర హోంశాఖ ( Central Home Ministry ) ఉద్దేశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిక్కుముడిపడిపోయిన సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరపడమే. ఇందు కోసమే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో రెండు రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి మాత్రమే ఉంటారు. ఈ కమిటీ 17వ తేదీన తొలి సమావేశం జరపాల్సి ఉంది. ఇందులో భాగంగా తెలంగాణతో చర్చించాల్సిన అవసరం లేని.. కేంద్రమే పరిష్కరించాల్సిన ప్రత్యేకహోదా, అదనపు నిధులకు సంబంధించిన విజ్ఞప్తులు కూడా కనిపించడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. చివరికి కేంద్ర హోంశాఖ సర్క్యులర్ మార్చి విడుదల చేసింది. 


కేంద్ర హోంశాఖ తాజా సర్క్యులర్ ప్రకారం ఏపీ ఫైనాన్స్‌ కొర్పొరేషన్‌ విభజన, విద్యుత్ బకాయిలు, విద్యుత్ సంస్థల్లో  నగదు అంశం,  వనరుల వ్యత్యాసం వంటి వాటిపై చర్చిస్తారు. అలాగే విభజన చట్టం షెడ్యూల్‌ 9, 10లోని ఆస్తుల పంపకాలపైనా భేటీలో చర్చించే అవకాశం ఉంది.  ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థిక పరమైన అంశాలకు ఓ పరిష్కారం చూపించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ తాజాగా జారీ చేసిన సర్క్యూలర్‌తో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ఆర్‌సీపీ నేతలకు నిరాశ మిగిలినట్లయింది.