తెలుగు చిత్ర పరిశ్రమలో ( Tollywood ) టిక్కెట్ రేట్ల అంశంపై వివాదాలు ఆగడం లేదు. తాజాగా "మా" ( MAA ) మాజీ అధ్యక్షుడు, మోహన్ బాబు క్యాంప్‌కు దగ్గరి వ్యక్తి అయిన నటుడు నరేష్ ( VK Naresh ) చేసిన ట్వీట్ టాలీవుడ్‌లో చర్చనీయాంశం అవుతోంది. టిక్కెట్ ధరలు ఇతర అంశాలపై ఫిల్మ్ చాంబర్‌తో ( AP Film Chamber ) చర్చించడమే ప్రజాస్వామ్యబద్ధమని.. వ్యక్తులతో చర్చించడం కరెక్ట్ కాదంటున్నారు. సమావేశం జరగడం ప్రశంసనీయమే కాదు అలా సమావేశం కావాల్సింది వ్యక్తులతో కాదన్నారు. త్వరలో ఈ విషయాన్ని ప్రభుత్వం, ఆ వ్యక్తులు గుర్తిస్తారని నరేష్ ట్వీట్ చేశారు.
చిరంజీవి ( Chiranjeevi ) సినీ పరిశ్రమకు సంబంధించి సీఎం జగన్‌తో ( AP CM Jagan ) చర్చలు జరపడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ చర్చలు జరిపారు. అయితే అప్పుడు నరేష్ ఎలాంటి ట్వీట్ చేయలేదు. రెండో సారి సమావేశంలో ముగ్గురు సూపర్ స్టార్లు, కొంత మంది నిర్మాతలు పాల్గొన్న తర్వాత అదీ కూడా మంచు కుటుంబం ఇంటికి పేర్ని నాని వచ్చిన తర్వాత ఆ వ్యవహారం వివాదాస్పదం అయిన తర్వాత స్పందించడం వ్యూహాత్మకమేనని కొంత మంది భావస్తున్నారు. సినీ పరిశ్రమతో జరిగిన చర్చల్లో తమకు ఆహ్వానం రాలేదని మోహన్ బాబు ( Mohan Babu ) పేర్ని నానికి చెప్పారు.
టాలీవుడ్‌తో చర్చల అంశంలో ప్రభుత్వం సెలక్టివ్‌గా ఉంటుంది. చిరంజీవితో పాటు మరికొంత మందినే పిలుస్తోంది. "మా" అధ్యక్షుడు అయిన మంచు విష్ణును ( Manchu Vishnu ) కూడా ఆహ్వానించలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం చిరంజీవికి ఇండస్ట్రీ పెద్ద అనే హోదా ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో మోహన్ బాబు బృందం ఏపీ ప్రభుత్వం వ్యక్తులతో కాదని ఫిల్మ్ చాంబర్‌తో చర్చలు జరపాలని అంటోంది. టిక్కెట్ల సమస్య పరిష్కారానికి ఫిల్మ్ చాంబర్ తో చర‌్చలు జరపడమే కరెక్టని.. చాంబర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నారు.
నరేష్ ట్వీట్ తర్వాత టాలీవుడ్‌లో చిరంజీవి బృందం చర్చలపై రెండు వర్గాలు తయారవడం ఖాయంగా కనిపిస్తోంది. మంచు మోహన్ బాబు చర్చలకు తనను పిలవలేదని .. పిలిచి ఉంటే తాను కూడా వచ్చే వాడ్ని పేర్ని నానికి ( Perni Nani ) చెప్పారు. ఇప్పుడు ఇది కూడా టాలీవుడ్‌లో రెండు వర్గాల మధ్య గ్యాప్ మరింత పెరగడానికి కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది.