Citizenship Amendment Act Rules: కేంద్ర హోం శాఖ Citizenship Amendment Act (CAA) పై ఇవాళ రాత్రి కీలక ప్రకటన చేసే అవకాశముంది. CAAకి సంబంధించిన నియమ నిబంధనలను వెల్లడించే అవకాశముందని ABP News సోర్సెస్ ద్వారా తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రకటన (PM Modi Announcement Highlights) చేయనున్నట్టు తెలుస్తోంది. చాలా రోజులుగా CAA అమలుపై చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల ముందే ఇది కచ్చితంగా అమలు చేసి తీరతామని అమిత్‌ షా గతంలోనే స్పష్టంగా చెప్పారు. ఎవరు అడ్డుకున్నా ఈ సారి వెనక్కి తగ్గం అంటూ తేల్చి చెప్పారు. ఈ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని, కొందరు కావాలనే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండి పడ్డారు. ఈ క్రమంలోనే హోంశాఖ ఈ నిబంధనలపై (CAA Rules) కీలక ప్రకటన చేస్తుందన్న వార్త ఉత్కంఠ రేపుతోంది. 2019లో CAA చట్టం అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నించినా...ఈశాన్య రాష్ట్రాలు సహా పశ్చిమ బెంగాల్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి అలజడి రేగుతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.






ఓ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. CAA అమలులో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా అవేవీ అడ్డుకోలేవని తేల్చి చెప్పారు. కొందరు కావాలనే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ చట్టంలో ఎలాంటి లొసుగులు లేవని అన్నారు. పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్‌లో ఆశ్రయం కోల్పోయిన హిందువులు, సిక్కులు,బుద్ధులు, పార్శీలు, క్రిస్టియన్లకు పౌరసత్వం కల్పించేందుకే ఈ చట్టం తీసుకొస్తున్నట్టు వెల్లడించారు అమిత్‌షా. 2014 డిసెంబర్ 31వ తేదీన కానీ అంతకన్నా  ముందుకానీ భారత్‌కి వచ్చిన వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. 


"కొంత మంది పని గట్టుకుని ముస్లిం సోదరులను తప్పుదోవ పట్టిస్తున్నారు. CAAకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ చట్టం ద్వారా ఎవరి హక్కుల్నీ లాగేసుకోవడం లేదు. పాకిస్థాన్, అఫ్గనిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో ఎన్నో ఇబ్బందులు పడి భారత్‌కి వచ్చిన వాళ్లకు పౌరసత్వం కల్పించేందుకే ఈ చట్టం"


- అమిత్ షా, కేంద్రహోం మంత్రి


గతంలో CAA చట్టం అమలు తీరుపై ప్రజలకు సరైన అవగాహన కల్పించలేదని భావిస్తోంది బీజేపీ. అందుకే...ఈ సారి అలాంటి సమస్య ఏమీ రాకుండా అన్ని విధాలుగా జాగ్రత్తపడినట్టు సమాచారం. అంతే కాదు. ఇందుకు సంబంధించిన నిబంధనల్నీ సిద్ధం చేసింది. ఓ ఆన్‌లైన్‌ పోర్టల్‌నీ రెడీ చేసింది. అంతా ఆన్‌లైన్‌లోనే జరిగేలా చూడనుంది. అప్లికెంట్స్ తమ పూర్తి వివరాల్ని ఆ పోర్టల్‌లో ఇవ్వాల్సి ఉంటుంది.