National Monetization Pipeline: ప్రైవేటీకరణ దిశగా కేంద్రం మరో నిర్ణయం.. ఇక ఈ ఆస్తులన్నీ అంతే!

ABP Desam   |  23 Aug 2021 06:16 PM (IST)

జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్ ను నేడు దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇప్పటికే పూర్తి అయిన మౌలిక సదుపాయాల పథకాలకు విలువ కట్టి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారు.

నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ప్రారంభం

విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నప్పటికా మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గట్లేదు. జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్ ను ఈరోజు దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా పర్యవేక్షణ లోపించిన పలు ఆస్తులను ప్రైవేటీకరణ చేసి నగదుగా మార్చనున్నారు. ఈ సందర్భంగా నిర్మలా కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ఆస్తులను మరింతగా పర్యవేక్షించొచ్చు. వీటిలో పెట్టుబడులు పెట్టి మౌలిక సదుపాయాలు పెంచొచ్చు. అయితే మేం వీటిని అమ్మేస్తున్నాం.. అనే వారికి ఒకటే సమాధానం చెప్పాలనుకుంటున్నాను. జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్ ద్వారా ఈ ఆస్తులను పర్యవేక్షిస్తాం అంతే. ఆస్తుల హక్కుదారు ప్రభుత్వమే. అయితే ప్రైవేట్ సెక్టార్ కు కొంత కాలం వీటిని అప్పజెప్తాం.                   - నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

అంటే ఏంటి..?
 
అసెట్‌ మానిటైజేషన్‌.. అంటే, ప్రభుత్వ ఆస్తులను డబ్బు రూపంలోకి మార్చుకోవడం. ఇందులో ఇప్పటికే పూర్తి అయిన మౌలిక సదుపాయాల పథకాలకు విలువ కట్టి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారు. ప్రైవేటు రంగం వాటి అంతిమ వినియోగదారుల నుంచి ఆదాయాన్ని సమకూరుస్తుంది.
 
పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్ పైప్‌లైన్లు‌, పలు జాతీయ రహదారులు సహా ఇతర ప్రాజెక్టుల నుంచి ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం దీనిని వినియోగిస్తోంది. ఇప్పటికే పవర్‌గ్రిడ్ పైప్‌లైన్లను మానిటైజ్‌ చేయడం కోసం ప్రత్యేక 'ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌ (ఇన్విట్స్‌)'ను ప్రభుత్వం నెలకొల్పింది. ఎయిర్‌పోర్టు నిర్వహణలో 'పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ)' సత్ఫలితాలిస్తోందని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో దీన్ని రైల్వేస్టేషన్లకు కూడా విస్తరించాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో తాజా అసెట్‌ మానిటైజేషన్‌లో పెద్ద ఎత్తున ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
 
Published at: 23 Aug 2021 06:16 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.