PM Reacts to Union Budget 2023:
కలలు సాకారం చేస్తుంది : ప్రధాని
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023పై ప్రధాని మోడీ స్పందించారు. గ్రామీణ ప్రజలు, పేదలు, రైతులకు ఈ బడ్జెట్ అండగా నిలిచిందని ప్రశంసించారు. మధ్య తరగతి ప్రజలకూ ప్రాధాన్యత దక్కిందని కొనియాడారు. భారత్ కలలను సాకారం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉందని స్పష్టం చేశారు.
"టెక్నాలజీకి ప్రియారిటీ దక్కింది. వెనకబడిన వర్గాలకూ ప్రాధాన్యతనిచ్చారు. మహిళలకూ ప్రత్యేక పథకాలు అందుబాటులోకి వచ్చాయి. దేశాభివృద్ధికి ఈ బడ్జెట్ మంచి బూస్టింగ్ ఇచ్చింది. MSMEల భద్రతకూ ఈ బడ్జెట్‌లో స్థానం దక్కింది. నిర్మలా సీతారామన్‌కు నా అభినందనలు"
-నరేంద్ర మోదీ, ప్రధాని
అమృత కాలంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇది అని అన్నారు ప్రధాని. భారత్ పురోగతికి ఇది బలమైన పునాది వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వెనకబడిన వర్గాలకు ప్రాధాన్యతనివ్వడాన్ని ప్రశంసించారు. ఇదే సమయంలో గ్రామాలు, పట్టణాల్లో నివసించే మహిళల జీవన శైలిలో మార్పులు తెచ్చేందుకూ ఈ బడ్జెట్ దోహదపడుతుందని అన్నారు.
"ఇన్ని ప్రోత్సాహక పథకాలతో బడ్జెట్‌కు రూపకల్పన చేయడం ఇదే తొలిసారి. అవసరమైన వారికి సరైన విధంగా శిక్షణ కల్పించడమే కాకుండా టెక్నాలజీ, క్రెడిట్, మార్కెట్ సపోర్ట్ కూడా అందనుంది. పీఎం వికాస్‌తో కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయి"
-నరేంద్ర మోదీ, ప్రధాని
వ్యవసాయ రంగానికి కేటాయించిన బడ్జెట్‌పైనా స్పందించారు ప్రధాని మోడీ. ఈ బడ్జెట్‌తో గ్రామాల్లోని కోఆపరేటివ్‌లను ప్రమోట్ చేసేందుకు వీలవుతుందని స్పష్టం చేశారు. పాడి, మత్య్స సాగు విస్తరణకూ ఇది అవకాశం కల్పిస్తుందని స్పష్టం చేశారు. తద్వారా ఎంతో మందికి ఆదాయ లభిస్తుందని తెలిపారు. మౌలిక వసతులపై గతంలో కన్నా కేటాయింపులు భారీగా పెంచినట్టు వెల్లడించారు. 2014తో పోల్చి చూస్తే..400% మేర కేటాయింపులు పెరిగినట్టు పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనపై పెట్టే పెట్టుబడులతో ఉద్యోగ సృష్టి జరుగుతుందని వెల్లడించారు.