PM Modi on UCC: ఎర్రకోట మీదుగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రసంగంలో యునిఫామ్ సివిల్ కోడ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కోడ్‌ని తీసుకురావాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. దేశాన్ని విభజించే చట్టాలకు కాలం చెల్లిందని, అలాంటి వాటిని పక్కన పెట్టేయాల్సి అవసరముందని తేల్చి చెప్పారు. UCC విషయంలో సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా ఉందని, త్వరలోనే ఈ కలను సాకారం చేసుకుంటామని అన్నారు. దేశ ప్రజలంతా ముందుకు వచ్చి యునిఫామ్ సివిల్‌ కోడ్‌పై తమ అభిప్రాయాలు చెప్పాలని సూచించారు ప్రధాని మోదీ. సెక్యులర్ కోడ్‌ని తీసుకొస్తే తప్ప మతపరమైన వివక్ష పోదని అభిప్రాయపడ్డారు. 


"యునిఫామ్ సివిల్ కోడ్‌పై సుప్రీంకోర్టు ఎన్నో సార్లు చర్చలు జరిపింది. దేశంలో మెజార్టీ ప్రజలు ఈ కోడ్‌కి మద్దతునిస్తున్నారు. అందుకే సుప్రీంకోర్టు కూడా సానుకూలంగానే స్పందించింది. ఇప్పుడున్న కోడ్‌ మతపరమైన వివక్షకు దారి తీస్తోంది. యునిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని రాజ్యాంగకర్తలూ కలలు కన్నారు. వాళ్ల కలల్ని నిజం చేయడం మా బాధ్యతగా భావిస్తున్నాం"


- ప్రధాని నరేంద్ర మోదీ




యునిఫామ్ సివిల్‌ కోడ్‌పై ఇంకా చర్చలు జరగాల్సిన అవసరముందని అన్నారు ప్రధాని మోదీ. ఇందులో ప్రజలూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఓ వర్గంపై వివక్ష చూపించే చట్టాలతో ఇప్పుడు పని లేదని, ఈ సమాజంలో అవి చెల్లవని స్పష్టం చేశారు. UCC అమలు చేస్తామని ముందు నుంచీ బీజేపీ చెబుతూనే ఉంది. ఆ పార్టీ మేనిఫెస్టోలో UCC ని ఎప్పుడో చేర్చింది. పైగా ఇది దేశ ప్రయోజనం కోసం చేస్తున్నాం కాబట్టి ప్రజల మద్దతు తప్పకుండా ఉంటుందని ధీమాగా ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఇది అమలవుతోంది.