UN - Taliban:
మహిళా ఉద్యోగులపై ఆంక్షలు..
అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి మహిళలపై ఆంక్షలు రెట్టింపయ్యాయి. యూనివర్సిటీల్లోకి అనుమతి లేదంటూ ఇప్పటికే సంచలన నిర్ణయం తీసుకుంది తాలిబన్ ప్రభుత్వం. ఇదొక్కటే కాదు. ప్రతి విషయంలోనూ వాళ్లపై ఆంక్షల్ని కఠినతరం చేస్తూ వస్తోంది. ఇటీవల మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ఐక్యరాజ్య సమితి సంస్థకు చెందిన మహిళా ఉద్యోగులపై నిషేధం విధించింది. వాళ్లు పని చేయడానికి వీల్లేదంటూ తేల్చి చెప్పింది. అఫ్గనిస్థాన్‌లోని నాన్గర్హర్ ప్రావిన్స్‌లో ఈ బ్యాన్ విధించింది తాలిబన్ ప్రభుత్వం. దీనిపై ఐరాస తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఫిమేల్ స్టాఫ్ లేకుండా కార్యకలాపాలు కొనసాగించడం కష్టం అని వెల్లడించింది. అయితే...దీనిపై ఇంకా తాలిబన్ ప్రభుత్వం స్పందించలేదు. కేవలం ఓ ప్రావిన్స్‌కు మాత్రమే ఈ ఆంక్షలు పరిమితం చేస్తారా..? లేదంటే దేశవ్యాప్తంగా ఇదే అమలు చేస్తారా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. నిజానికి గతేడాదే తాలిబన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. NGOల్లో పని చేసే మహిళా ఉద్యోగులందరిపైనా ఆంక్షలు విధించింది. అప్పటికి ఐరాస మహిళా ఉద్యోగులను టార్గెట్ చేయలేదు. అయితే...ఐక్యరాజ్య సమితి మాత్రం తమనూ టార్గెట్ చేస్తారని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకు తగ్గట్టుగానే ఓ ప్రావిన్స్‌లో నిషేధం విధించారు తాలిబన్లు. ఈ నిర్ణయంపై స్పందించిన యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి నిర్ణయాలను సహించేదే లేదని తేల్చి చెప్పారు.
"అఫ్గనిస్థాన్‌లో మా కార్యకలాపాలు విస్తృతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇలా నిషేధించడం సరికాదు. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్న స్పష్టత లేదు. ఇందుకోసమే తాలిబన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. లైఫ్ సేవింగ్ ఆపరేషన్స్‌లో మహిళా ఉద్యోగుల పాత్ర కీలకం. వాళ్లపై నిషేధం విధించడాన్ని ఖండిస్తున్నాం. "
- ఐక్యరాజ్యసమితి ప్రతినిధి
మహిళలపై దాడులు..
అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల పాలన వచ్చినప్పటి నుంచి అక్కడి మహిళలు నరకం చూస్తున్నారు. వాళ్లపై ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మహిళలకు స్వేచ్ఛ లేకుండా కట్టడి చేస్తున్నారు. షరియా చట్టాన్ని అమలు చేస్తూ...కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి బదక్షన్ ప్రావిన్స్‌లో జరిగింది. ఫైజాబాద్‌లోని ఓ గ్రౌండ్లో 11 మందిని ప్రజలందరూ చూస్తుండగానే దారుణంగా కొట్టినట్టు తాలిబన్ సుప్రీం కోర్టు వెల్లడించింది. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, చట్టానికి వ్యతిరేకంగా నడుచుకున్నారన్న ఆగ్రహంతో బహిరంగంగానే తాలిబన్లు వాళ్లను విచక్షణా రహితంగా కొట్టారు. అంతకు ముందు 16 మందిని కూడా ఇదే కారణంతో కొట్టినట్టు సుప్రీం కోర్టు తెలిపింది. నిజానికి...అక్కడ ఇలా శిక్ష విధించడం చాలా సాధారణమైపోయింది. ఏ తప్పు చేసినా సరే...నేరుగా వీధుల్లోకి తీసుకొచ్చి అందరి ముందు శిక్ష విధిస్తారు. ఇప్పటి వరకూ రకరకాల నేరాలు చేశారన్న కారణంగా 250 మందిని ఇలా కొట్టినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. తాలిబన్ల ప్రభుత్వంపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా...వాళ్లు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. షరియా చట్టం ప్రకారమే నడుచుకుంటున్నామని చెబుతున్నారు.
Also Read: Kichcha Sudeep Threat: కిచ్చ సుదీప్‌కు బెదిరింపు లేఖ, ప్రైవేట్ వీడియోలు బయట పెడతామంటూ వార్నింగ్