Ukrainian Minister India Visit: 


నాలుగు రోజుల పర్యటన..


రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఏడాదిన్నర అవుతోంది. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పట్లో వెనక్కి తగ్గే అవకాశాలూ కనిపించడం లేదు. ఈ వివాదం విషయంలో భారత్ మొదటి నుంచి ఒకే స్టాండ్‌పై ఉంది. అటు రష్యాను విమర్శించకుండా...ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని చెబుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఉక్రెయిన్ విదేశాంగ డిప్యుటీ  మంత్రి ఎమైన్ జాపరోవా (Emine Dzhaparova) భారత్‌కు రానున్నారు. ఏప్రిల్ 9 (రేపు) నుంచి నాలుగు రోజుల పాటు ఇక్కడే పర్యటించనున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలు పెట్టినప్పటి నుంచి అధికారికంగా ఆ దేశానికి చెందిన ప్రతినిధి భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 12 వరకూ ఆమె భారత్‌లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ అధికారికంగా వెల్లడించింది. పశ్చిమ దేశాల విదేశాంగ వ్యవహారాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్యదర్శి సంజయ్ వర్మతో ఆమె భేటీ కానున్నారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని స్థితిగతులపైనా చర్చించే అవకాశాలున్నాయి. ఆ తరవాత జారపోవా...భారత విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ మంత్రి మీనాక్షి లేఖితోనూ సమావేశం కానున్నారు. 


"ఉక్రెయిన్‌తో ఎన్నో ఏళ్లుగా భారత్ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తోంది. 30 ఏళ్లలో దౌత్యపరమైన సహకారంతో పాటు వాణిజ్యం, విద్య, సాంస్కృతిక, రక్షణ రంగాల్లో పరస్పరం సహకారం అందించుకుంటున్నాయి. ఇప్పుడు ఉక్రెయిన్ మంత్రి రాకతో ఈ బంధం మరింత బలోపేతం కానుంది"


- భారత విదేశాంగ శాఖ










మానవతా సాయం కోసమా..? 


ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు...ఉక్రెయిన్ మంత్రి మానవతా సాయం కోరనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు రష్యా దాడుల కారణంగా ధ్వంసమైన మౌలిక వసతులను మరమ్మతు చేసుకునేందుకు ఎక్విప్‌మెంట్‌నూ అడగనున్నట్టు సమాచారం. అంతే కాదు. కీవ్‌ సందర్శనకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరే అవకాశాలూ ఉన్నాయి. మానవతా సాయంతో పాటు మెడికల్ ఎక్విప్‌మెంట్, మందులు,మరమ్మతులకు అవసరమైన పరికరాలను ఉక్రెయిన్‌ భారత్‌ను కోరనుందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. జులైలో రష్యా అధ్యక్షుడు పుతిన్ షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు కోసం భారత్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో...ఉక్రెయిన్ మంత్రి భారత్‌ పర్యటనకు రావడం ఆసక్తికరంగా మారింది. ఈ సారి భారత్ నేతృత్వంలో జరిగే G20 సదస్సుకి ఉక్రెయిన్‌ను ఆహ్వానించనున్నట్టు సమాచారం. 


Also Read: China Warns Taiwan: తైవాన్‌ను టెన్షన్ పెడుతున్న చైనా, మిలిటరీ డ్రిల్స్‌ చేస్తామంటూ ప్రకటన