China Warns Taiwan:
యుద్ధం తప్పదా..?
చైనా మరోసారి తైవాన్‌ను టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పుడీ వేడిని మరింత పెంచుతోంది చైనా. వరసగా మూడు రోజుల పాటు తైవాన్‌ను టార్గెట్ చేస్తూ మిలిటరీ విన్యాసాలు చేపట్టనుంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. ఈ మధ్యే తైవాన్ అధ్యక్షుడు త్సాయ్ ఇంగ్‌వెన్ అమెరికా పర్యటన ముగించుకుని వచ్చారు. ఆ వెంటనే చైనా ఈ ప్రకటన చేసింది. తైవాన్ విషయంలో అమెరికా జోక్యాన్ని ఖండిస్తోంది డ్రాగన్. తైవాన్, అమెరికా మధ్య మైత్రిపై మండి పడుతోంది. అందుకే...తైవాన్ అధ్యక్షుడు అమెరికా వెళ్లి రాగానే మిలిటరీ విన్యాసాలు చేస్తామంటూ హెచ్చరించింది. యుద్ధ సన్నద్ధతకు సంబంధించిన ఎక్సర్‌సైజ్‌లు చేయనున్నట్టు స్పష్టం చేసింది. సౌత్, నార్త్, ఈస్ట్ తైవాన్‌లలోనే ఈ ప్రదర్శనలు నిర్వహించనుంది. ఇదంతా ఓ ప్లాన్ ప్రకారమే చేస్తోంది డ్రాగన్. తైవాన్ తమదే అని చైనా ఎప్పటి నుంచో క్లెయిమ్ చేసుకుంటోంది. అయితే..దీనిపై తైవాన్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. అమెరికాతో అంటకాగితే ఆకస్మిక దాడులు చేస్తామంటూ చైనా గతంలోనే తైవాన్‌ను హెచ్చరిచింది. గతేడాది ఆగస్టులో అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ తైవాన్‌లో పర్యటించారు. అప్పటి నుంచి చైనా ఆగ్రహంగానే ఉంది. ఇప్పుడు ఏకంగా మిలిటరీ డ్రిల్స్ చేస్తున్నామంటూ ప్రకటించింది. యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్‌లను సిద్ధం చేసుకుంటోంది.
తైవాన్‌కు అమెరికా సపోర్ట్..
తైవాన్ విషయంలో అగ్రరాజ్యం వైఖరి స్పష్టంగానే కనిపించినా...ప్రత్యేక దేశంగా మాత్రం అధికారికంగా గుర్తించలేదు. ఆర్థికంగా పూర్తి స్థాయిలో తైవాన్‌కు అండగా ఉంటామని చెబుతోంది అమెరికా. ఇటీవల హౌజ్ స్పీకర్ నాన్సీ తైవాన్‌లో పర్యటించటంపై చైనా ఉడికిపోయింది. ఇక్కడ కీలకంగా చర్చించాల్సిన విషయం ఏంటంటే..అమెరికా-తైవాన్ మధ్య ఎలాంటి దౌత్యపరమైన సంబంధాలు లేవు. అయినా...తైవాన్‌కు అండగా నిలబడతామని స్పష్టం చేసింది. ఇటీవల నాన్సీ కూడా అదే విషయాన్ని చెప్పారు. తైవాన్‌ను ఒంటరిగా చేయాలనుకున్న చైనా ఆలోచనను తిప్పికొట్టారు. ఇప్పటికైతే ఇలాంటిదేమీ జరగదన్నది అంతర్జాతీయ విశ్లేషకుల మాట. కేవలం బెదిరించో, ఆంక్షలు విధించో దారికి తెచ్చుకోవాలని చూస్తుంది తప్ప...ఆక్రమించటం వరకూ వెళ్లదని వివరిస్తున్నారు. చైనా ప్రస్తుతానికి క్షిపణి ప్రయోగాలు చేస్తూ తైవాన్‌ను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ...ఆ భూభాగంలోకి చొచ్చుకుని పోయే సాహసం చేయదని స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పటివరకైతే ఓ విషయం స్పష్టమవుతోంది. చైనా ఎప్పటికీ తైవాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించదు. 2049లోగా తైవాన్‌ను తమ భూభాగంలో కలుపుకుంటామని డెడ్‌లైన్ కూడా పెట్టింది. ప్రస్తుతానికి చైనా ప్లాన్స్ ఏంటి అన్నది మాత్రం ఇంకా తేలలేదు. చైనాకు మూడోసారి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు జిన్‌పింగ్. ఈ సారి తైవాన్‌ను టార్గెట్ చేసుకున్నారని తెలుస్తోంది. పూర్తిస్థాయి అధికారాలు వినియోగించి తైవాన్‌ను ఆక్రమించాలని చూస్తున్నారు. అయితే..అమెరికా మాత్రం ఇందుకు అడ్డు తగులుతోంది. అవసరమైతే తైవాన్‌కు మిలిటరీ సపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
Also Read: North Korea - South Korea: ఫోన్ ఎత్తని కిమ్, తెగ టెన్షన్ పడిపోతున్న సౌత్ కొరియా - ఏం జరగనుంది?