Vladimir Putin: 'ఉక్రెయిన్- రష్యా యుద్ధం అయ్యేసరికి పుతిన్ కథ ముగిసిపోతుంది'

ABP Desam   |  Murali Krishna   |  30 Oct 2022 05:23 PM (IST)

Vladimir Putin: ఉక్రెయిన్- రష్యా యుద్ధం ముగిసేసరికి వ్లాదిమిర్ పుతిన్ తన అధికారాన్ని కోల్పోతారని ఉక్రెయిన్ పేర్కొంది.

'ఉక్రెయిన్- రష్యా యుద్ధం అయ్యేసరికి పుతిన్ కథ ముగిసిపోతుంది'

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై ఉక్రెయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. పుతిన్‌ను పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు ఇప్పటికే రష్యాలో మొదలయ్యాయని ఉక్రెయిన్ పేర్కొంది. ఈ మేరకు ఉక్రెయిన్‌ డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ కైరైలో బుదనోవ్‌ తెలిపారు.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ముగిసేసరికి వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్ష పదవిలో ఉండరు. ఎందుకంటే ఆయన్ను తప్పించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనుక పుతిన్‌ కొనసాగడం కష్టమే. పుతిన్‌ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంపై చురుగ్గా చర్చలు జరుగుతున్నాయి.                            -    కైరైలో బుదనోవ్‌, ఉక్రెయిన్‌ డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌

అదే లక్ష్యం                                                        

ఖెర్సాన్‌ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు ఉక్రెయిన్‌ ఎదురుదాడి చేస్తోందని ఆయన అన్నారు.

నవంబర్‌ చివరి నాటికి ఖెర్సాన్‌ను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో మా సైన్యం సాగుతోంది. క్రిమియాను స్వాధీనం చేసుకోవడమే మా లక్ష్యం. మా దేశం కోసం చివరి వరకు మేం పోరాడతాం. రష్యా సేనలను మా భూభాగంలో నుంచి తరిమికొడతాం.                                             -   బుదనోవ్, ఉక్రెయిన్ డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌

పుతిన్ 

అణ్వాయుధాల ప్రయోగంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగించే ఉద్దేశం తమకు లేదని పుతిన్‌ స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు ప్రయోగించాల్సిన అవసరం మాకు లేదు. రాజకీయంగా, సైనికపరంగా కూడా మాకు అలాంటి అవసరం లేదు. ప్రపంచంపై పెత్తనం కోసం పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రయత్నాల వల్లనే ప్రస్తుత సంక్షోభం తలెత్తింది. ఇతర దేశాలపై పెత్తనం సాగించేందుకు పశ్చిమ దేశాలు ప్రమాదకరమైన, క్రూరమైన క్రీడ ఆడుతున్నాయి.                                              "
-   వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు

ఉక్రెయిన్‌లో ఆక్రమించిన భూభాగాలను కాపాడుకొనేందుకు తనకు ఉన్న దారులు మూసుకుపోతే అణుదాడి చేస్తానని పుతిన్‌ అంతకుముందు హెచ్చరించారు.

"ఉక్రెయిన్‌లోని రష్యా నియంత్రణలోని గల భూభాగాల్లోని ప్రజలు.. నియో నాజీల పాలనలో ఉండాలని కోరుకోవడం లేదు. వారికి స్వేచ్ఛ కల్పిస్తాం. పశ్చిమ దేశాలను రష్యాను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. కానీ ఆ బెదిరింపులకు రష్యా తలొగ్గదు. ఎందుకంటే వారి హెచ్చరికలను ఎదుర్కొనే ఆయుధ సంపత్తి మా సొంతం. హద్దులు దాటిన ఐరోపా దేశాలు ఇది గుర్తు పెట్టుకోవాలి. మా ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వాటిల్లితే అణ్వాయుధాలను ప్రయోగించడానికి కూడా మేం వెనుకాడం.                                                 "

-   వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు

Also Read: Viral Video: స్నేహమంటే ఇదేరా! కాకిని కాపాడిన ఎలుగుబంటి!

Published at: 30 Oct 2022 05:18 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.