ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులను తరలించే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్ిటంది. ఇప్పటికే 219 మందితో ఓ విమానం ముంబైకి బయలుదేరింది. భార‌తీయ విద్యార్థుల‌తో ఎయిరిండియా విమానం ముంబైకి బ‌య‌ల్దేరింది. రాత్రి ఎనిమిది తర్వాత ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది. ఈ విష‌యాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్ట‌ర్ ఎస్ జైశంక‌ర్ వెల్ల‌డించారు. 219 మంది విద్యార్థుల‌తో మొద‌టి విమానం ఇండియాకు బ‌య‌ల్దేరిన‌ట్లు ఆయ‌న తెలిపారు. 






కేంద్ర విదేశాంగ శాఖ అధికార యంత్రాంగం ఎప్ప‌టిక‌ప్పుడు ఉక్రెయిన్‌లోని ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తూ, విద్యార్థుల‌ను సుర‌క్షితంగా తీసుకొచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. తాను వ్య‌క్తిగ‌తంగా ఉక్రెయిన్ ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు జై శంక‌ర్ వెల్ల‌డించారు. . ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతుందని, తాను స్వయంగా ఈ విషయాన్ని పర్యవేక్షిస్తున్నానని స్పష్టం చేశారు. అక్కడ చిక్కుకున్న భారతీయులతో మాట్లాడుతున్నామని, వారిని స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు 


ఉక్రెయిన్ గగనతలం మూసేశారు. ఇప్పుడు అక్కడ యుద్ధ విమానాలు తప్ప ఏమీ తిరగడం లేదు. అందుకే ఉక్రెయిన్‌లో ఇరుక్కున్న వారిని తీసుకు రావడానికి భారత ప్రభుత్వం భిన్నమైన ప్రయత్నాలు చేస్తోంది. ఉక్రెయిన్‌తో సరిహద్దు ఉన్న రొమేనియా దేశంతో మాట్లాడి అక్కడి నుంచి ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తోంది. ఉక్రెయిన్‌లో ఇరుక్కున్న విద్యార్థుల్ని రొమేనియా బోర్డర్‌కు చేరుకోవాలని సూచిస్తున్నారు. అలా వచ్చిన వారిని వచ్చినట్లుగా విమానాల్లో తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబైతో పాటు ఢిల్లీకి మరో విమానం చేరుకోనుంది. ఢిల్లీకి చేరుకునే విమానంలో ఇద్దరు తెలుగు విద్యార్థులున్నారు. 


ఉక్రెయిన్ నుంచి వచ్చే విద్యార్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం టెస్టులు చేయనున్నారు. అలాగే నెగెటివ్ వచ్చిన వారిని వారి సొంత ప్రాంతాలకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉక్రెయిన్ ఉన్న భారతీయులందర్నీ తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది.