Ukraine Russia War:


రష్యా దాడులతో..


రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకీ సంక్లిష్టమవుతోంది. క్రెచ్ వంతెనపై బాంబు దాడి జరిగిన తరవాత రెండు దేశాల మధ్య వైరం ఇంకా పెరిగింది. ఉక్రెయిన్‌పై క్షిపణుల దాడికి దిగుతోంది రష్యా. ఇప్పటికే పలు కీలక ప్రాంతాల్లో డ్రోన్‌లతో దాడులు మొదలు పెట్టింది. పవర్ జనరేటింగ్ ప్లాంట్స్‌పైనా రష్యా దాడులు చేస్తున్న నేపథ్యంలో...ఉక్రెయిన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించుకుంది. జెలెన్‌స్కీ సన్నిహితుడు ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. గత వారమే జెలెన్‌స్కీ ఓ ప్రకటన చేశారు. "దేశంలోని 30%పైగా విద్యుత్ స్టేషన్లపై రష్యా దాడి చేసింది" అని చెప్పారు. అందుకే..ఆయన వెంటనే సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. పవర్ స్టేషన్ల వద్ద సెక్యూరిటీ కట్టుదిట్టం చేయాలనుకున్నా..తరవాత వాటికి విద్యుత్ సరఫరా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆలోచనలో ఉండగానే మరో విద్యుత్ స్టేషన్‌పై దాడి జరిగింది. అందుకే...వెంటనే ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చింది
ఉక్రెయిన్ ప్రభుత్వం. "ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఈ నిబంధన ఉల్లంఘిస్తే తాత్కాలికంగా వాటిని బ్లాకౌట్‌కు గురి కాక తప్పదు" అని స్పష్టం చేసింది. 


రష్యా ఉక్రోశం..


ఉక్రెయిన్‌పై రష్యా ఉక్రోశం రోజురోజుకీ పెరుగుతోంది. క్రెచ్ ఘటన జరిగిన తరవాత పుతిన్ దూకుడు మరింత పెంచారు. ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతాలపై రష్యా సైన్యం మిసైల్స్‌తో దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే రాజధాని కీవ్‌పైనా డ్రోన్‌లతో దాడులు చేసింది. ఉక్రెయిన్ ప్రెసిడెన్సీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. "కమికేజ్ డ్రోన్స్ (Kamikaze drones)" దాడి చేసినట్టు  తెలిపింది. కీవ్‌లోని రెండు ప్రాంతాల్లో బాంబు దాడులు
జరిగాయి. "ఇలాంటి దాడులు చేయటం వల్ల తమకు ఏదో ఒరుగుతుందని రష్యా అనుకుంటోంది. కానీ...ఓడిపోతామేమోనన్న నిరాశలో ఇలాంటివి చేస్తున్నారని మాకు అర్థమవుతోంది" అని ఉక్రెయిన్ అంటోంది. ప్రస్తుతం ఉన్న సైన్యం తమకు చాలటం లేదని, రక్షణను ఇంకా పెంచుకోవాల్సి ఉందని అంటున్నారు ఉన్నతాధికారులు. "ఆలస్యం చేసేంత సమయం లేదు. ఇప్పటికిప్పుడు మాకు ఆయుధాలు కావాలి. మా గగనతలాన్ని రక్షించుకుంటూ శత్రువుని మట్టుబెట్టాలి" అని స్పష్టం చేస్తున్నారు. 


వరుస దాడులు..


క్రిమియాలోని క్రెచ్ వంతెనపై బాంబు దాడి జరిగినప్పటి నుంచి ఉక్రెయిన్‌పై పుతిన్ ఇంకా ఆగ్రహంగా ఉన్నారు. ఇది కచ్చితంగా ఉక్రెయిన్ చేసిన పనేనని చాలా గుర్రుగా ఉన్నారు. అందుకే...ఆ దేశంపై మరింత కక్ష పెంచుకున్నారు. వెంటనే...ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపించారు. ఉక్రెయిన్‌లోని 40 ప్రాంతాలపై క్షిపణుల దాడులు చేసింది రష్యా. రాజధాని కీవ్‌లోనూ దాడి జరిగింది. డ్రోన్‌ల సాయంతో ఇలా విరుచుకుపడింది రష్యా సైన్యం. అయితే...ఈ దాడుల్లో ఎంత మంది చనిపోయారన్నది మాత్రం ఇంకా లెక్క తేలలేదు. కొన్ని ప్రాంతాల్లో అత్యంత కీలకమైన వసతులన్నింటినీ ధ్వంసం చేసినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్‌ ఓ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ వాయుసేన..రష్యా డ్రోన్ దాడులను గట్టిగానే ఎదుర్కొంది. ఎదురు దాడికి దిగి రష్యాలోని 25 ప్రాంతాలపై 32 సార్లు దాడి చేసినట్టు వెల్లడించింది. 


Also Read: New Covid Variant: టీకా వేసుకున్నారా? అయినా జాగ్రత్తగా ఉండాల్సిందే- పండుగ వేళ వార్నింగ్!