Zelenskyy Trolled: 


దేశంలో జరుగుతోందేంటి..మీరు చేస్తోందేంటి..?


రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని నెలలుగా రష్యా దాడులు చేస్తూనే ఉంది. క్రమక్రమంగా కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంటూ వస్తోంది. ఇటు ఉక్రెయిన్ సైన్యమూ శక్తి మేర పోరాటం చేస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఏ మాత్రం వెనకాడకుండా ప్రతిదాడులు చేస్తున్నారు. రష్యాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలూ చేస్తున్నారు. ప్రపంచ దేశాలు ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆయన చేసిన ఓ పని ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఇన్నాళ్లూ జెలెన్‌స్కీని ఆకాశానికెత్తేసిన వాళ్లే ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. వోగ్‌ డిజిటల్ ఎడిషన్‌ కవర్‌ పేజ్‌ కోసం తన భార్య ఒలెనాతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఒలెనా జెలెన్‌స్కీ ఈ ఫోటో షూట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఓ టేబుల్‌పై ఇద్దరూ చేతులు పట్టుకుని కూర్చున్న ఫోటోలతో పాటు, జెలెన్‌స్కీ తన భార్యను ఒడిలో కూర్చోబెట్టుకున్న ఫోటోలూ ట్రోల్‌కు గురవుతున్నాయి. ప్రముఖ ఫోటోగ్రాఫర్ యానీ లీబోవిట్జ్‌ ఈ ఫోటోలు తీశారు.