భారత సంతతి వ్యక్తులు ప్రపంచ దేశాల్లో సాధించిన విజయాల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ అరుదైన ఘనత సాధించారు. అయితే మరో భారత సంతతి వ్యక్తి ఏకంగా బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్ని కలిసొస్తే త్వరలోనే ఆయన ఇంగ్లాండ్ అధికార పగ్గాలు చేపట్టే అవకాశం ఉందట. కానీ ఇప్పుడప్పుడే బ్రిటన్‌లో ఎన్నికలు కూడా లేవు. కానీ ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి? ఆ వ్యక్తి ఎవరు? అసలు ఇది సాధ్యమేనా?
ప్రధానిపై విమర్శలు..
ప్రస్తుతం బ్రిటన్ ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇందుకు కారణం ఏడాదిన్నర క్రితం దేశాన్ని కొవిడ్ సంక్షోభం ముంచెత్తిన వేళ '10 డౌన్ స్ట్రీట్'లోని అధికారిక నివాసంలో తన సహచరులతో కలిసి బోరిస్ పార్టీ చేసుకున్న ఘటన ఇప్పుడు వెగులులోకి వచ్చింది. అప్పటికే కరోనా కట్టడి నిమిత్తం దేశంలో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అటువంటి సమయంలో జాన్సన్ విందు ఏర్పాటు చేయడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సొంత పార్టీ కూడా..
బోరిస్‌పై ప్రతిపక్ష లేబర్ పార్టీ మాత్రమే కాదు సొంత కన్జర్వేటివ్ పార్టీ నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. దీంతో చేసేదేమీ లేక ఆయన గురువారం దిగువ సభ 'హౌస్ ఆఫ్ కామన్స్' సాక్షిగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అయినప్పటికీ బోరిస్ దిగిపోవాల్సిందేనని వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన వారసుడు ఎవరనే విషయంపై బెట్టింగ్‌లు కూడా నడుస్తున్నాయట. ఇలా ఇంగ్లాండ్ ప్రధాని రేసులో ఓ భారత సంతతి వ్యక్తి పేరు బలంగా వినిపిస్తోంది.
ఆ వ్యక్తి ఎవరంటే?
రిషి సునక్.. ప్రస్తుతం ఈయన బ్రిటన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతుల నిర్వర్తిస్తున్నారు. మనందరికీ సుపరిచితులైన ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి రిషి స్వయానా అల్లుడు. బోరిస్ సభలో క్షమాపణలు చెబుతున్న సమయంలో రిషి అక్కడ లేకపోవడంపై ఆ దేశంలోని ప్రధాన పత్రికలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ప్రధానిపై వస్తున్న ఆరోపణల నుంచి దూరంగా ఉండే ఉద్దేశంతోనే ఆయన సభకు రాలేదని వార్తలు వచ్చాయి.
కానీ అది నిజం కాదని రిషి సునక్ ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. ఉద్యోగ కల్పనపై కొనసాగుతున్న బృహత్ ప్రణాళికపై వివిధ వర్గాలతో చర్చలు జరుపుతున్న క్రమంలోనే తాను సభకు హాజరుకాలేకపోయానని తెలిపారు. ప్రస్తుతం బోరిస్ జాన్సన్‌పై విచారణ జరుగుతోంది. మరి బోరిస్ దిగిపోతే తదుపరి ప్రధాని రిషి సునక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.
Also Read: Mumbai: ముంబయి.. సోమాలియా వెళ్లిపోతుందట..! అరేబియా సముద్రం మాయమైపోతుందట! ఈ షాకింగ్ విషయాలు విన్నారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి