UK Army Horses: లండన్‌లో ఆర్మీకి చెందిన రెండు గుర్రాలు తప్పించుకుని పారిపోయాయి. సెంట్రల్ లండన్‌లో రోడ్ల మీద అవి పరిగెడుతూ కనిపించాయి. అందరూ వాటిని వింతగా చూస్తూ నిలబడిపోయారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అవి పారిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బస్‌లు, ట్యాక్సీలను దాటుకుని మరీ వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాయి రెండు గుర్రాలు. వాటికి గాయాలు కూడా అయినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఇప్పటి వరకూ వాటి ఆచూకీ దొరకలేదు. పోలీసులు,ఆర్మీ అధికారులు కలిసి అదే పనిలో నిమగ్నమయ్యారు.
యూకే ఆర్మీలో గుర్రాలూ ఓ భాగమే. అక్కడ ఎన్నో గుర్రపుశాలలున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల వద్ద గుర్రాలు కనిపిస్తాయి. లండన్ పోలీస్‌లకు ఆర్మీ అధికారులు కాల్ చేసి గుర్రాలు మిస్ అయ్యాయని చెప్పారు. అప్పటి నుంచి అన్ని చోట్లా వెతుకుతున్నారు. రోడ్లపైన గుర్రాలు పరిగెత్తిన సమయంలో అక్కడి వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళన చెందారు. సరిగ్గా సిగ్నల్ పడిన సమయంలోనే అవి రోడ్డుపైన పరుగులు పెట్టడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరో ఐదు గుర్రాలు కూడా ఆర్మీ డ్రిల్‌లో చాలా ఇబ్బంది పెట్టాయని అధికారులు వెల్లడించారు. దానిపైన కూర్చున్న సైనికులను కింద పడేశాయని తెలిపారు. అందులో ఒకరు గాయపడ్డారు.