Union Minister Narayan Rane: శివసేన (యుబిటి) నేత ఉద్ధవ్ ఠాక్రే కిరాయి హంతకులతో తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. నవంబర్ 2019 నుంచి జూన్ 2022 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే, కోవిడ్-19 మహమ్మారి సమయంలో మందులు కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
ఉద్దవ్ నుంచి కాంట్రాక్ట్ తీసుకున్న వారి నుంచి తనకు బెదిరింపు ఫోన్లు వచ్చాయని రాణే తెలిపారు. తనను హత్య చేసేందుకు పలువురికి సుపారీ (కాంట్రాక్ట్‌లు) ఇచ్చేందుకు ఠాక్రే ప్రయత్నించారని, అయితే ఎవరూ సఫలం కాలేదని పేర్కొన్నారు. ఇలాంటి కాంట్రాక్టుల కోసం తమను సంప్రదిస్తున్నారని కొందరు వ్యక్తులు తనను హెచ్చరించారని రాణే చెప్పారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విలువలేని సీఎం అంటూ ఉద్దవ్‌ను విమర్శించిన నేపథ్యంలోనే శివసేన మాజీ నేత నారాయణ రాణే.. ఠాక్రేపై విమర్శలు గుప్పించారు. ఉద్దవ్ వర్గానికి చెందిన మహిళా కార్యకర్తపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
తనను ఉద్దేశించి బలహీనమైన హోంమంత్రి అంటూ ఉద్దవ్ చేసిన విమర్శలపై ఫడ్నవీస్ స్పందిస్తూ, తాను కూడా అదే తరహా భాషను ఉపయోగించగలనని, అయితే తాను అందుకు వ్యతిరేకమని స్పష్టంచేశారు. అధికారాన్ని నిలుపుకోవడం కోసం ఠాక్రే తన భావజాలంతో రాజీ పడ్డారని విమర్శించారు. ఠాక్రేను "బలహీనమైన" ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్‌ను ఉద్దేశించి మాట్లాడిన ఫడ్నవీస్.. జైలుకు వెళ్లిన ఇద్దరు మంత్రులను తన మంత్రివర్గం నుంచి తప్పించలేకపోయాని, వారితో రాజీనామా చేయించలేకపోయారంటూ ఉద్దవ్‌ను విమర్శించారు. అంతేకాకుండా లంచం ఆరోపణలపై తొలగించిన పోలీసు అధికారి సచిన్ వాజ్‌ను ఠాక్రే రక్షించారని ఫడ్నవీస్ ఆరోపించారు.
ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు తర్వాత 2022 జూన్‌లో కూలిపోయిన మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ చేతులు కలిపిన తర్వాత 2019 నవంబర్‌లో థాకరే ముఖ్యమంత్రి అయ్యారు.
కాగా.. ఆదివారం ప్రధానమంత్రి మోదీపై విరుచుకుపడ్డ ఉద్ధవ్ ఠాక్రే.. దివంగత హిందూత్వ వీరుడు వీర సావర్కార్ స్వప్నమైన అఖండ భారత్ సాధించే ధైర్యం భారతీయ జనతా పార్టీకి ఉందా అని ప్రశ్నించారు. ఛత్రపతి శంభాజీ నగర్‌లో జరిగిన మహా వికాస్ అఘాడి (MVA) తొలి ర్యాలీని ఉద్దేశించి ఠాక్రే మాట్లాడుతూ, “సావర్కర్ దేశ స్వాతంత్ర్యం కోసం కఠినమైన జైలు శిక్షతో పాటు ఎన్నో కష్టాలను అనుభవించారు. అంతేకానీ మోదీని ప్రధానిని చేయడం కోసం కాదు. సావర్కర్ జీవిత స్వప్నమైన 'అఖండ భారత్'ను మీరు నెరవేర్చగలరా?" అని ప్రశ్నించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్హత వివరాలు కోరినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టు రూ. 25,000 జరిమానా విధించిన కొద్ది రోజుల తర్వాత, ఉద్దవ్ ఠాక్రే కూడా ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ వైఖరిని తప్పుపట్టారు. “ఏ కాలేజీ అయినా తమ విద్యార్థి దేశానికి ప్రధాని అయితే గర్వపడుతుంది. నేను ముఖ్యమంత్రిగా, ఎన్‌సీపీకి చెందిన జయంత్ పాటిల్ నా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు, మా ఇద్దరినీ మేము చదువుకున్న ముంబయిలోని బాల్‌మోహన్ విద్యామందిర్ సత్కరించింది. ఇది తమ సంస్థకు గర్వకారణమని వారు భావించారు" అని ఆయన అన్నారు.
“దేశంలో డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేని యువకులు చాలా మంది ఉన్నారు. ప్రధానమంత్రిని తన డిగ్రీని చూపించమని అడిగితే జరిమానా రూ.25,000 విధిస్తారు. ప్రధాని తమ విద్యాసంస్థలోనే చదివారని గర్వంగా ప్రకటించుకోలేని కాలేజీ ఎక్కడుంది? అని ఆయన ప్రశ్నించారు.