ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడకొట్టేందుకు జనసేనతో కలిసి నిరంతరం పోరాటం సాగిస్తామని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోమువీర్రాజు (AP BJP Chief Somu Veerraju) వెల్లడించారు. పొత్తులో ఉన్నారు కాబట్టే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను జనసేనాని పవన్ కళ్యాణ్ కలిశారని సోము వీర్రాజు వెల్లడించారు.
జనసేనతో పొత్తు ఉంటుంది...
జనసేన పార్టీలో పొత్తు ఉంటుందని, ఎవ్వరు ఎన్ని ప్రచారాలు చేసినా వాటిని పట్టించుకోమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. జనసేన బీజేపీ కలిసే ఉన్నాం, ఉంటాం అన్నారు. పవన్ తో పొత్తులో ఉన్నాం కాబట్టే ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను పవన్ కలిశారని వీర్రాజు చెప్పారు .మా రెండు పార్టిలు కలసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేవరకు కలిసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు ను కలిసినంత మాత్రాన పొత్తులో ఉన్నారనటంలో అర్థం లేదని వీర్రాజు కొట్టి పారేశారు. నిరంతరం ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఫైట్ చేస్తూనే ఉంటామని అన్నారు.
వినాయక విగ్రహం ధ్వంసం దారుణం..
గుంటూరు జిల్లా ఫిరంగపురం లో వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేయడం దుర్మార్గమయిన చర్యని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. పురాతన ఆలయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎందుకు దఫ‌దఫాలుగా దాడులు జరుగుతుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. రామతీర్ధం, అంతర్వేది రథం దగ్ధం, దుర్గమ్మ ఆలయంలో వెండి సింహాల చోరీతో పాటు పలు ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయని సొము వీర్రాజు గుర్తు చేశారు. రాష్ట్రంలో హైందవ ధర్మాన్ని అపహాస్యం చేసే కుట్ర జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఆలయాల్లోని విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదని, ఇప్పటివరకు ఒక్కరిని కూడ ఎందుకు  అరెస్ట్ చేయలేదని వీర్రాజు ప్రశ్నించారు. విగ్రహాలు ధ్వసం చేసిన వారిని అరెస్ట్ చేయాలని అడిగితే బీజేపీకి చెందిన నాయకులపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. ఫిరంగిపురం వినాయకుని విగ్రహం ధ్వంసంలో కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. విగ్రహ ధ్వంసం ఘటనలో నిందితులను అరెస్ట్ చేయకుంటే కపిలతీర్థం నుంచి రామతీర్థం దాకా యాత్ర చేపడతామని వెల్లడించారు.
బీఆర్ఎఎస్ ప్రభుత్వంపై సోము వీర్రాజు మండిపాటు
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని సోము వీర్రాజు ఖండించారు. ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వ పిరికిపంద చర్యని అభివర్ణించారు. ఇటువంటి చర్యలకు బీజేపీ భయపడదని వీర్రాజు వ్యాఖ్యానించారు. పదవ తరగతి పరీక్ష పేపర్ లీక్ లో బండి సంజయ్ పాత్ర ఉందనడం కుట్ర మాత్రమేనని అన్నారు. గతంలో ఇలానే కుట్రలు పన్నారని తరువాత అవన్నీ ఉష్ కాకి అయిపోయాయని చెప్పారు. ప్రధాని మోదీ ని ఎదుర్కొనేందుకు డబ్బు సంపాదించాలనే కేసీఆర్ ఇటువంటి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ కుట్రలకు బీజేపీ నాయకులు భయపడరని స్పష్టం చేశారు.
బాబు జగ్జీవన్ రామ్ కు నివాళి...
బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి సోము వీర్రాజు నివాళులు అర్పించారు. జగ్జీవన్ రామ్ దేశానికి ఆదర్శప్రాయమైన నేత అని వ్యాఖ్యానించారు. రైతులను ఆదుకోవడానికి ఆయన చేసిన సేవలు నేటికి మరువలేనివి అని కొనియాడారు.