Family Doctor Scheme: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సంక్షేమ విధానాన్ని ప్రారంభించనుంది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర సర్కారు.. అందులో భాగంగా మరో విధానాన్ని ఆవిష్కరించనుంది. ఫ్యామిలీ డాక్టర్ అనే విధానాన్ని ఏప్రిల్ 6వ తేదీన గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నూతన విధానాన్ని సీఎం జగన్ పల్నాడు జిల్లాలో ప్రారంభించనున్నారు.


పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగం గుంట్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత కావూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. వైద్య, ఆరోగ్య సేవలు రాష్ట్రం నలుమూలల విస్తరించాలన్న ఉద్దేశంతో పాటు ప్రతి ఒక్కరికీ స్పెషలిస్టు డాక్టర్ల సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రారంభించనుంది. దానికి ఫ్యామిలీ డాక్టర్ అనే పేరును పెట్టింది. ఈ విధానాన్ని రాష్ట్ర సర్కారు కొన్ని రోజులుగా దశలవారీగా ట్రయల్ రన్స్ నిర్వహిస్తూ వస్తోంది. అందులో మంచి ఫలితాలు రావడంతో ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయాలని జగన్ ప్రభుత్వం సంకల్పించింది. గురువారం రోజు (ఏప్రిల్ 6న) పల్నాడు జిల్లాలో సీఎం జగన్ ఫ్యామిలీ డాక్టర్ ను ప్రారంభించనున్నారు.


ముఖ్యమంత్రి జగన్ ప్రోగ్రాం షెడ్యూల్


గురువారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుండి సీఎం జగన్ బయలుదేరతారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో పల్నాడు జిల్లా లింగంగుంట్లకు చేరుకుంటారు. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ ఎంటర్ ను పరిశీలిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ స్టాల్స్ ను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. అనంతరం కావూరు గ్రామంలో ఏర్పాటు చేసే సభకు హాజరై బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత సీఎం జగన్ తిరిగి  తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. 


ఫ్యామిలీ డాక్టర్ విధానం 
ఫ్యామిలీ డాక్టర్స్ ద్వారా సాధారణ వైద్య ఆరోగ్య సేవలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ విధానంతో గ్రామీణ ప్రాంతంలో అనేక రోగాలకు సకాలంలో చికిత్స అందుతుంది. ఫ్యామిలీ డాక్టర్స్ రోగులకు నేరుగా చికిత్స అందిస్తారు. లేదంటే మెరుగైన చికిత్స కోసం స్పెషలిస్టు వైద్యులకు సిఫార్సు చేస్తారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం కింద గ్రామీణ ప్రాంతాల్లో వైద్య అవసరాలను ఆరంభ దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది. దీనివల్ల మెరుగైన వైద్యం కోసం నకిలీ డాక్టర్లపై ఆధారపడే అవసరం ఉండదు. శాస్త్రీయంగా, కచ్చితంగా జరిగే రోగ నిర్ధారణ పరీక్షల వల్ల రోగం ఏంటో తెలుసుకోవడంతో పాటు ఆసుపత్రుల్లో ఉండాల్సిన అవసరం తగ్గుతుంది. వీటితో పాటు ఫ్యామిలీ డాక్టర్ విధానం వల్ల జిల్లా ఆసుపత్రులపై ఒత్తిడి, పని భారంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కొనసాగిస్తారని తెలుస్తోంది. దీని వల్ల నిరుపేదలకు సైతం మంచి మెరుగైన వైద్యం అందుతుంది.