Blasts in Pakistan: పాకిస్థాన్‌లో ఎన్నికలకు సరిగ్గా ఓ రోజు ముందు అలజడి రేగింది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో వరుస బాంబు పేలుళ్లు స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాయి. ఈ పేలుళ్లలో కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. దాదాపు 46 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయనున్న ఓ స్వతంత్ర అభ్యర్థి ఆఫీస్‌ బయటే ఓ బాంబు పేలింది. ఇక్కడే 17 మంది మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు. గంటలోపే Jamiat-Ulema Islam-Pakistan ఎలక్షన్ ఆఫీస్ ఎదుట మరో బాంబు పేలింది. ఇక్కడ 8 మంది బలి అయ్యారు. ఆఫీస్ బయట ఓ బ్యాగ్‌లో బాంబు పెట్టారని, రిమోట్ కంట్రోల్‌తో దాన్ని ఆపరేట్ చేసి పేల్చారని సీనియర్ పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ పేలుళ్లలో గాయపడిన వాళ్లలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అకాశముంది. 


"ఉగ్రవాదులు కావాలనే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులనే టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఈ దాడులను దృష్టిలో పెట్టుకుని మరింత భద్రత కల్పిస్తాం. అన్ని పోలింగ్ స్టేషన్‌లలో భద్రతను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అనుకున్న విధంగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూస్తాం"


- పోలీస్ అధికారులు


 






ఇటు ఇమ్రాన్ ఖాన్‌ అరెస్ట్, ఆర్థిక సంక్షోభం లాంటి పరిణామాల మధ్య ఎన్నికలు జరుగుతుండడం ఉత్కంఠ పెంచుతోంది. పైగా ఈ ఉగ్రదాడులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే...ఈ దాడుల వెనక ఎవరున్నారన్నది ఇంకా తెలియలేదు. ఏ ఉగ్ర సంస్థ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ మధ్య కాలంలో తాలిబన్లు అక్కడక్కడా దాడులకు పాల్పడ్డారు. ఇప్పుడు కూడా వాళ్లే దాడి చేసి ఉంటారని భావిస్తున్నారు. ప్రచారం అంతా ముగిసిపోయిన సమయంలో ఉన్నట్టుండి బాంబు పేలుళ్లు అలజడి రేపాయి. ఎన్నికలు జరిగే సమయంలో ఇమ్రాన్ ఖాన్ అనుచరులు ఆందోళనలు చేపట్టే ప్రమాదముందని పోలీసులు ముందుగానే జాగ్రత్తపడుతున్నారు. వీలైనంత వరకూ ఓటింగ్ శాతాన్ని పెంచాలని చూస్తున్నారు. ఇప్పటికే నవాజ్‌ షరీఫ్ భారీ ఎత్తున తన అనుచరులతో ర్యాలీ చేపట్టారు. తప్పకుండా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. యువత తమ పార్టీకే మద్దతునిస్తారని తేల్చి చెబుతున్నారు. 


పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాప్ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు భారీ షాక్ తగిలింది. అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసులో (సైఫర్ కేసు) ఇమ్రాన్ కు పాకిస్థాన్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆయన సన్నిహితుడు మహ్మద్ ఖురేషీకి కూడా శిక్ష పడినట్లు ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించాయి. కాగా, తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ కు ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు ఇటీవలే నిలిపేసింది. అయితే, వెను వెంటనే ఆయన్ను సైఫర్ కేసులో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇమ్రాన్ రావల్పిండిలోని అడియాాలా జైలులో ఉన్నారు. 


Also Read: యువరాజు ఏమీ చేయలేకపోతున్నారు, రాహుల్‌పై ప్రధాని మోదీ సెటైర్లు