PM Modi Speech in Rajya Sabha: ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. మన దేశ సామర్థ్యం, భవిష్యత్ గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చాలా గొప్పగా మాట్లాడారని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి చురకలు అంటించారు. అనవసరంగా కొందరు రాష్ట్రపతి ప్రసంగంపై విమర్శలు గుప్పించారని మండి పడ్డారు. ఖర్గే చాలా స్వేచ్ఛగా మాట్లాడారని, ఆయన అంతకు స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చిందా అని తమకే ఆశ్చర్యం కలిగిందని సెటైర్లు వేశారు.
"మల్లికార్జున్ ఖర్గేకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. ఆయనకు నా ప్రత్యేక అభినందనలు. ఆయన మాట్లాడిన ప్రతి మాటనీ చాలా శ్రద్ధగా విన్నాను. లోక్‌సభలో వినోదం లేదే అని చాలా విచారించాను. కానీ ఆయన ఆ లోటు లేకుండా చేశారు. స్పెషల్ కమాండర్స్ లేని సమయంలో ఆయన ప్రసంగించారు. దీన్నో మంచి అవకాశంగా ఆయన భావించారు"
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు..
తమకు 400 సీట్లు రావాలని ఖర్గే ఇలా ఆశీర్వదించారంటూ సెటైర్లు వేశారు ప్రధాని మోదీ. ఆలోచనల్లోనూ కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని విమర్శించారు. పాత పార్లమెంట్ భవనంలోనూ తాను మాట్లాడుతుంటే ఇదే విధంగా అంతరాయం సృష్టించారని..కాంగ్రెస్ నేతలు సభలో వినేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండరని విమర్శించారు. కానీ తన గొంతుకను ఎవరూ అణిచివేయలేరని, ఇది దేశ ప్రజలు ఇచ్చిన గొంతు అని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌లోనే ఉగ్రవాదం, తీవ్రవాదం విపరీతంగా పెరిగాయని మండి పడ్డారు. బ్రిటన్ పార్లమెంట్ ఎలా నడిస్తే అలా మన దేశ పార్లమెంట్‌ని కాంగ్రెస్ నడిపించిందని విమర్శించారు. యుద్ధ వీరులకు కాంగ్రెస్ కనీస గౌరవం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని సంవత్సరాల పాటు దేశాన్ని పరిపాలించిన పార్టీ ఇలా దిగజారిపోవడం చూసి జాలేస్తోందని అన్నారు. పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను ఐదో స్థానానికి తీసుకొచ్చామని వెల్లడించారు. యూపీఏ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైపోయిందని ఫైర్ అయ్యారు. ఆర్టికల్ 370 రద్దు చేసి ప్రజలకు న్యాయం చేశామని తేల్చి చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తోందని మండి పడ్డారు. అలాంటి కాంగ్రెస్ ప్రజాస్వామ్యం గురించి లెక్చర్లు ఇస్తోందని విమర్శించారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్‌లను నెహ్రూ వ్యతిరేకించారని అన్నారు.