Turkey Earthquake:
కొనసాగుతున్న సహాయక చర్యలు..
టర్కీ, సిరియాలో భూకంప బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గంటల కొద్ది శిథిలాల కింద నలిగిపోయిన వారిని గుర్తించి కాపాడుతున్నాయి బృందాలు. ఈ క్రమంలోనే టర్కీలో దాదాపు 278 గంటల పాటు శిథిలాల కిందే చిక్కుకుని నరకయాతన అనుభవించిన ఓ 45 ఏళ్ల వ్యక్తిని కాపాడారు. భూకంపం వచ్చిన రోజునే ఇలా శిథిలాల కింద ఇరుక్కుపోయాడా వ్యక్తి. అప్పటి నుంచి సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. 12 రోజుల తరవాత ఆయనను గుర్తించిన సిబ్బంది సురక్షితంగా బయటకు తీసింది. ఇలా చాలా మంది రోజుల పాటు ఇలా శిథిలాల కిందే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బయటకు వచ్చే దారి తెలియక ఆకలితో నకనకలాడిపోతున్నారు. 278 గంటల తరవాత ఆ వ్యక్తిని బయటకు తీసి ఓ స్ట్రెచర్‌పై తీసుకొచ్చింది సిబ్బంది. గోల్డెన్ థర్మల్ జాకెట్ కప్పి స్ట్రెచర్‌కు కట్టేసి సేఫ్‌గా బయటకు తీసుకొచ్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న ఆంబులెన్స్‌లోకి ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ముఖం మాత్రం బయటకు కనబడలేదు. అంతకు ముందు ఎంతో శ్రమించి 14 ఏళ్ల బాలుడిని కాపాడారు. దేశవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు టర్కీ వైస్ ప్రెసిడెంట్ వెల్లడించారు. ఇప్పటికే టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 41 వేలకు పెరిగింది. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. లక్షలాది మంది ఎలాంటి షెల్టర్ లేకుండా చలిలోనే వణికిపోతున్నారు.