Heavy Rush in Tirumala: తిరుమలలో (Tirumala) శ్రీవారి సర్వ దర్శనంపై గందరగోళం నెలకొంది. టికెట్లు లేకుండా సర్వ దర్శనానికి (Sarvadarshan) వచ్చిన భక్తులను తితిదే అధికారులు క్యూలైన్లలోకి అనుమతించడం లేదు. దీంతో భక్తులు (Devotees) ఏటీసీ కూడలి వద్ద గుంపులుగా బైఠాయించి, విజిలెన్స్ సిబ్బందితో (Vigjilence) వాగ్వాదానికి దిగారు. 31 కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు దైవ దర్శనం కలిగించకుండా టీటీడీ చేస్తోందని భక్తులు ఆరోపిస్తున్నారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్లు దొరకలేదని, శుక్రవారమైనా సర్వ దర్శనానికి అనుమతించాలని భక్తులు వేడుకుంటున్నారు. శనివారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ - 2, నారాయణ గిరి షెడ్లు నిండి నారాయణగిరి అతిథి గృహం వరకూ క్యూలైన్ చేరుకుంది. దీంతో వైకుంఠ ద్వార దర్శనానికి ఇబ్బంది కలుగుతుందని భావించి, టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి దర్శనానికి అనుమతి నిరాకరించారు. రేపటి సర్వ దర్శనం టిెకెట్లు ఉన్న వారిని సాయంత్రం క్యూలైన్లలోకి పంపిస్తామని చెప్పారు.
తొలుత అలా.. కానీ
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం టోకెన్లు లేకపోయినా సర్వ దర్శనానికి అనుమతిస్తామని తితిదే అధికారులు తొలుత ప్రకటించారు. అయితే, భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో టోకెన్లు ఉన్న వారికే దర్శనానికి అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు, శ్రీవారి వైకుంఠ ద్వార సర్వ దర్శన టోకెన్లను తితిదే పంపిణీ చేయడం మొదలుపెట్టింది. భక్తుల రద్దీ దృష్ట్యా నిర్దేశించిన సమయం కంటే ముందుగానే రాత్రి నుంచే టోకెన్ల పంపిణీ ప్రారంభించింది. వైకుంఠ ద్వార ప్రవేశాల కోసం తిరుపతిలో 9 కేంద్రాలను టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించగా, క్యూ కౌంటర్ల వద్ద భక్తులను అదుపు చేయడం సిబ్బంది వల్ల కాలేదు. దీంతో గురువారం అర్ధరాత్రి నుంచే వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను జారీ చేయడం ప్రారంభించారు. ప్రత్యేక రంగుల్లో ముద్రించిన టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు.
వీఐపీల తాకిడి
తిరుమలలో ఈ నెల 23 (శనివారం) నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. 10 రోజుల పాటు 80 వేల మంది శ్రీవారి దర్శించుకునేలా తితిదే అధికారులు ఏర్పాట్లు చేశారు. 10 రోజుల పాటు 2.50 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్ లైన్ ద్వారా విడుదల చేసిన టీటీడీ మరో 4.20 లక్షల సర్వ దర్శన టికెట్లను తిరుపతిలో జారీ చేయనుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులు తాకిడ విపరీతంగా పెరిగింది. ఇప్పటికే ఏపీ మంత్రులు, ముఖ్య అధికారులు తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం రాత్రికి అసెంబ్లీ స్పీకర్, ఇతర ప్రముఖులు తిరుమలకు రానున్నారు. సుప్రీంకోర్టు నుంచి ఏడుగురు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 35 మంది న్యాయమూర్తులు తిరుమలకు వస్తున్నట్లు సమాచారం. అటు, టీటీడీ పాలక మండలి సభ్యులు ఐదుగురు తిరుమలలోనే మకాం వేశారు. వారే కాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైకుంఠనాథుని దర్శనం కోసం క్యూ కడుతున్నారు. వీఐపీలు అధిక సంఖ్యలో వస్తుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వారికి వసతి, దర్శన సౌకర్యాల కల్పించే విషయంలో తితిదేపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: YSRCP Politics: అంతుచిక్కని బాలినేని అంతరంగం, మాజీ మంత్రి వ్యవహారశైలి పార్టీకి తలనొప్పిగా మారుతోందా?