Tirumala Vision 2047 : స్వర్ణాంధ్ర విజన్ - 2047 తరహాలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణపై దృష్టి సారించింది. ఈ వ్యూహాత్మక చొరవలో భాగంగా “తిరుమల విజన్ 2047”ను ప్రారంభించినట్లు ప్రకటించింది. తిరుమలలో వారసత్వ పరిరక్షణను అమలు చేసే లక్ష్యంలో భాగంగా ప్రతిపాదనలు (proposals) ఆహ్వానిస్తోంది. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, టీటీడీ ఈ పరివర్తన ప్రణాళికకు సహకరించేందుకు ప్రఖ్యాత ఏజెన్సీలను ఆహ్వానిస్తూ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP)ని విడుదల చేసింది. ఆసక్తి ఉన్న ఏజెన్సీలు 3 వారాల్లోగా ప్రపోజల్స్ పంపించాలని టీటీడీ సూచించింది. ఇలాంటి భారీ స్థాయి పట్టణ ప్రణాళిక, మౌళిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఏజెన్సీలకు అనుభవం తప్పనిసరి అని తెలిపింది. ఇటీవల తిరుమలలో జరిగిన సమావేశంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసింది.
ఏపీ సీఎం చంద్రబాబు విజన్
తిరుమల అభివృద్ధిలో సాంప్రదాయాన్ని, ఆధునికతతో సమతుల్యం చేసుకోవాల్సిన అవసరాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తెలియజేశారు. తిరుమల ఆధ్యాత్మికం, పవిత్రత, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించి ముందుచూపుతో భక్తులకు సౌకర్యాలు, వసతిని మెరుగుపర్చాలని ఆయన పిలుపునిచ్చారు.
విజన్ డాక్యుమెంట్-2047 లక్ష్యాలు
- ఆధునిక పట్టణ ప్రణాళిక నిబంధనలను అనుసరిస్తూ తిరుమల పవిత్రతను పెంపొందించేందుకు శాశ్వతమైన వ్యూహాలను అమలు చేయడం.
- ఉత్తమమైన ప్రణాళికలు, వారసత్వ పరిరక్షణ, పర్యావరణ బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వడం.
- ప్రపంచవ్యాప్తంగా తిరుమలను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు.
- తిరుమల అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయడం.
- భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జోనల్ అభివృద్ధి ప్రణాళికను సవరించడం.
- తిరుమల పవిత్రతను కాపాడడం.
- భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు వ్యూహాలు రూపొందించడం.
- ప్రతి అంశంపై వివరణాత్మక నివేదికలు సిద్ధం చేయడం.
- కన్సల్టెంట్ల నుంచి ప్రతిపాదనలకు ఆహ్వానం
తిరుమల విజన్ 2047 లక్ష్యాలను చేరుకునేందుకు, పట్టణ ప్రణాళిక, ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్, వారసత్వ పరిరక్షణ, పర్యావరణ నిర్వహణపై ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలను టీటీడీ ఆహ్వానిస్తోంది. ఇప్పటికే తిరుమల పట్టణ ప్రణాళికపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
ప్రతిపాదనలకు గడువు
మూడు వారాల్లోగా ఆసక్తి గల ఏజెన్సీల నుంచి తమ ప్రతిపాదనలను సమర్పించాల్సిందిగా టీటీడీ కోరింది. ఇలాంటి భారీ స్థాయి పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఏజెన్సీలకు ముందస్తు అనుభవం తప్పనిసరని తెలిపింది.
ప్రణాళిక లక్ష్యాలు
వారసత్వ పరిరక్షణ, పర్యావరణ నిర్వహణ, ఆధునిక పట్టణ ప్రణాళికలను మిళితం చేసే ఒక బృహత్తర భవిష్యత్ ప్రణాళికలను రూపొందించడం. తిరుమలలో రాబోవు తరాల్లో మరింతగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక పవిత్రతను కాపాడటమే ప్రణాళిక లక్ష్యం.
భక్తులకు గంటలోపే దర్శనం
ఎన్నో ఏళ్లుగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు రోజుల తరబడి వేచి ఉండే పరిస్థితికి త్వరలో ముగింపు పడనుంది. చల్లటి గాలుల్లో పిల్లా పాపలతో కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లలో ఇబ్బందులు పడుతున్న సామాన్య భక్తులకు ఈ పరిస్థితి నుంచి విముక్తి లభించనుంది. కలియుగ దైవం దర్శనం కోసం తిరుమలకు వచ్చిన భక్తులకు కేవలం గంటలోపే స్వామి వారి దర్శనాన్ని కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక తీర్మానం చేసింది. అంతేకాదు దీనిపై కసరత్తు కూడా మొదలుపెట్టింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు చర్యలకు ఉపక్రమించారు.
ఎక్కడా సిబ్బందితో పని లేకుండా ఆటోమేటిక్‌గా విమానాశ్రయాల్లో ఏ విధంగా అయితే డిజిలాకర్ పద్ధతి అమలు చేస్తున్నారో.. అదే తరహాలో తిరుమల కొండపై కూడా భక్తులు గంటలు తరబడి వేచి ఉండే అవసరం లేకుండా లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కేవలం గంట సమయంలోపుగా శ్రీవారి దర్శనాన్ని భక్తులకు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది. టీటీడీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం ద్వారా భక్తులకు కేవలం గంటలోపుగా శ్రీవారి దర్శనం కల్పించే నూతన విధానాన్ని అమలు కోసం ఇప్పటికే టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పూర్తి వివరాలను అందించారు.