Tirumala Income on 10 Days Vykunta Dwara Darshan: కలియుగ వైకుంఠం తిరుమలలో (Tirumala) 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా రూ.40.20 కోట్ల హుండీ ఆదాయం లభించినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD EO DharmaReddy) తెలిపారు. మంగళవారం తిరుమలలోని (Tirumala) అన్నమయ్య భవన్ (Annamayya Bhawan) లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకూ 10 రోజుల పాటు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించినట్లు చెప్పారు. 6,47,452 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకున్నట్లు వెల్లడించారు. 17.81 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారని, 35.60 లక్షల లడ్డూ ప్రసాదాలు విక్రయించారని, 2.13 లక్షల మంది తలనీలాలు సమర్పించారని చెప్పారు. భక్తులకు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించి నాలుగేళ్లవుతోంది. 2020లో ఈ సంప్రదాయాన్ని ప్రారంభించిన టీటీడీ, దేశంలోని మఠాధిపతులు, పీఠాధిపతుల అనుమతులతో 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించవచ్చని ఆగమ సలహా మండలి సైతం ఆమోదముద్ర వేసింది. 


వన్య మృగాల సంచారంపై


కాగా, ఇటీవల తిరుమలలో వన్య మృగాల సంచారంపై ఈవో ధర్మారెడ్డి స్పందించారు. కాలిబాట మార్గంలో వన్య మృగాల సంచారం నేపథ్యంలో శేషాచల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల ద్వారా వన్య మృగాల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే రూ.3.50 కోట్లతో అధునాతన కెమెరాలు కొనుగోలు చేస్తున్నామని ప్రకటించారు. 


నిర్మాణాలపై రాజకీయాలు


అలిపిరి మండపాల పునఃనిర్మాణంపై రాజకీయాలు చేస్తున్నారని ధర్మారెడ్డి మండిపడ్డారు. పురాతన మండపాలు శిథిలావస్థకు చేరుకుంటే.. వాటికి వెంటనే మరమ్మతులు చెయ్యొచ్చని, కూలిపోయే పరిస్థితి ఉంటే జీర్ణోద్ధరణ చేయడంతో పాటు భక్తులకు అనువుగా మార్పులు చెయ్యొచ్చని చెప్పారు.  అలిపిరి మండపాల పునఃనిర్మాణంపై కొందరు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఆర్కియాలజీ సంస్థకు లేఖ రాశామని, అయినా స్పందన లేదన్నారు. కొందరు రాజకీయ దురుద్దేశంతో గందరగోళం సృష్టించడం వల్ల అలిపిరి వద్ద శిథిలావస్థలో ఉన్న మండప పునఃనిర్మాణం ఆగిపోయిందని ఆరోపించారు. 


నేటి నుంచి శ్రీవారి సర్వ దర్శనాలు


వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం నుంచి శ్రీవారి సర్వ దర్శనాల టోకెన్ల జారీని అధికారులు పునఃప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శన స్లాట్లు ప్రారంభమయ్యాయి. మరోవైపు, జనవరిలో విశేష పర్వదినాల సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 5న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల ముగింపు, 6న తిరుమల శ్రీవారి సన్నిధికి వేంచేపు, 7న సర్వ ఏకాదశి, 9న తొండరడిప్పొడియాళ్వార్ వర్ష తిరునక్షత్రం, 14న భోగి ముగింపు, ధనుర్మాసం ముగింపు, 15న మకర సంక్రాంతి సుప్రభాత సేవ పునఃప్రారంభం, 16న తిరుమల శ్రీవారి పార్వేట మండపానికి వేంచేపు, కనుమ పండుగ, 25న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి, 28న తిరుమొళిశైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 31న కూరత్తాళ్వార్ తిరు నక్షత్రం నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.


Also Read: Anganwadi staff : అంగన్‌వాడీలకు ప్రభుత్వం అల్టిమేటం- విధుల్లో చేరకుంటే చర్యలు తప్పవని వార్నింగ్