ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే. అందుకే ఒక హీరోతో సినిమా పూర్తయ్యి.. అది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత మరో స్టార్, మరో సినిమా గురించి ఆలోచించగలుగుతారు దర్శకులు. కానీ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ మాత్రం గత కొంతకాలంగా రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు. ఒకవైపు కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ షూటింగ్‌ను.. మరోవైపు రామ్ చరణ్ హీరోగా ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్‌ను ఒకేసారి మ్యానేజ్ చేయడానికి శంకర్ ప్రయత్నిస్తున్నారు. కానీ ‘ఇండియన్ 2’ మేకర్స్ ఇచ్చిన అప్డేట్‌ చూస్తుంటే.. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’కు లైన్ క్లియర్ అని అనిపిస్తోంది.


షూటింగ్‌పైనే ఫోకస్


1996లోనే ఒక పొలిటికల్ థ్రిల్లర్‌గా ‘భారతీయుడు’ చిత్రాన్ని తెరకెక్కించి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నాడు శంకర్. ఇన్నేళ్ల తర్వాత అదే సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాడు. కేవలం సీక్వెల్ మాత్రమే కాకుండా దీనిని ఒక ఫ్రాంచైజ్‌లాగా చేయాలని అనుకున్నాడు. కానీ ‘ఇండియన్ 2’ అనౌన్స్‌మెంట్ జరిగినప్పటి నుంచి షూటింగ్‌కు పలుమార్లు బ్రేక్ పడుతూనే ఉంది. అయితే ఈ షూటింగ్ మళ్లీ రీస్టార్ట్ అయిన తర్వాత ‘ఇండియన్ 2’తో పాటు ‘ఇండియన్ 3’ చిత్రీకరణను కూడా ఒకేసారి పూర్తి చేయాలని శంకర్ నిర్ణయించుకున్నాడు. అందుకే ప్రస్తుతం ‘ఇండియన్ 2’ షూటింగ్‌పై మూవీ టీమ్ ఫోకస్ పెట్టింది. అనుకున్నట్టుగానే అనుకున్న సమయానికి చెన్నై షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది ఈ సినిమా.


ఫిబ్రవరిలోపు ఫినిష్


గత కొన్ని వారాలుగా చెన్నైలోనే ‘ఇండియన్ 2’ (తెలుగులో ‘భారతీయుడు-2) షూటింగ్ జరుగుతోంది. అయితే తాజాగా ఈ షెడ్యూల్ పూర్తయ్యి.. మూవీ టీమ్ అంతా తరువాతి షెడ్యూల్‌కు షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నట్టు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సీక్వెల్ దాదాపుగా 95 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుందట. ప్రస్తుతం ఇంకా ఈ సినిమాలో ఒక్క పాటను షూట్ చేస్తే.. ‘ఇండియన్ 2’ షూటింగ్ మొత్తంగా పూర్తయినట్టే అని తెలుస్తోంది. ఇక దీని తర్వాత ‘ఇండియన్ 3’ షూటింగ్‌ను వెంటనే ప్రారంభించి.. దానిని కూడా ఫిబ్రవరీలోపు పూర్తి చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఇంతకాలంగా ఈ ఫ్రాంచైజ్ షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో దీనిపై ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.


రామ్ చరణ్ ఫ్యాన్స్ హ్యాపీ


ఇండియన్ ఫ్రాంచైజ్‌లో మరోసారి కమల్ హాసన్.. సేనాపతి అనే పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సీక్వెల్స్ కూడా కచ్చితంగా ఏదో ఒక సోషల్ మెసేజ్‌తోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయని శంకర్ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇక ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ షూటింగ్ గురించి ఒక క్లారిటీ రావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ సైతం హ్యాపీగా ఫీలవుతున్నారు. త్వరగా ఆ షూటింగ్ పూర్తి చేసుకుంటే ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్‌ను ప్రారంభించవచ్చు అని వారు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లోని ‘గేమ్ ఛేంజర్’ మూవీ కొన్నాళ్లు శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. కానీ ‘ఇండియన్ 2’కు కలిగిన ఇబ్బందుల వల్ల శంకర్.. వెంటనే అటు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఫైనల్‌గా కమల్ హాసన్ మూవీ అప్డేట్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.


Also Read: రకుల్ పెళ్లికి ముహూర్తం ఖరారు? ఆ తేదీన వెడ్డింగ్, బ్యాచిలర్ పార్టీ కోసం థాయ్‌ల్యాండ్ ప్రయాణం!