ఒక్కో దళిత కుటుంబానికి రూ. పది లక్షలంటూ కేసీఆర్ తీసుకు వచ్చిన "దళిత బంధు" పథకం ఇప్పుడు ఇతర వర్గాల్లో ఆశలు రేపుతోంది. ఇతర పార్టీలు వ్యూహాత్మకంగా...కేసీఆర్‌పై ఇతర వర్గాల్లో వ్యతిరేకత పెంచేందుకు ఉపయోగించుకుంటున్నారు.  దళితులకు రూ. పది లక్షలు అనేది టోకరానేనని... ఏదో కొద్ది మందికి ఇచ్చి అందర్నీ  మోసం చేస్తారన్న విమర్శలు ఇప్పటికే అన్ని పార్టీల నేతలు చేస్తున్నారు. దానికి తోడు.. "మీకేం ఎక్కువ .. దళిత బంధు ఎందుకు ఇవ్వరు " అని.. ఇతర వర్గాలను దువ్వడం ప్రారంభించారు. 


ఎస్టీలకూ రూ. పది లక్షలివ్వాలని రేవంత్ డిమాండ్..! 


తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ విషయంలో దూకుడుగా ఉన్నారు. ముందుగా ఆయన ఎస్టీ వర్గాల్లో ఈ ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. సామాజిక పరంగా దళితుల కన్నా బాగా వెనుకబడిన వారు ఎస్టీ వర్గాలు.  నిరుపేదలు ఎక్కువ. రిజర్వేషన్ల ఫలాలు పొందిన అతి కొద్ది మంది... మళ్లీ మళ్లీ రిజర్వేషన్లు పొందుతున్నారు కానీ... ఆ వర్గాల్లో వెనుకబడిన వారు వెనుకనే ఉన్నారు. అత్యంత పేదరికంలో ఉన్నారు. దళితులకు కేసీఆర్ సర్కార్ చేస్తున్న సాయం చూసి.. వారికి కూడా తాము మాత్రం ఎందుకు అభివృద్ధి చెందకూడదన్న అభిప్రాయం వారి మనసుల్లోకి వచ్చింది. దీన్ని వ్యూహాత్మకంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పెంచుతున్నారు. ఎందుకివ్వరని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం దళిత, గిరిజన దండోరా నిర్వహణకు రేవంత్ సిద్ధమయ్యారు. 


తర్వాత బీసీ, ఇతర వర్గాలకు ఇవ్వాలని అన్ని పార్టీల ఉద్యమాలు..!


అదే సమయంలో.. తర్వాత ఆయన బీసీ వర్గాలను దువ్వే ప్రయత్నం చేస్తారు. మీకు ఎందుకు కేసీఆర్ రూ. పది లక్షలుఇవ్వరని వారి వద్దకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలా అన్ని వర్గాల వద్దకూ వెళ్లి...  రూ. పది లక్షల కోసం కేసీఆర్‌పై ఒత్తిడి పెంచేలా.. ఆయన ప్రచార ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఇతర పార్టీలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నాయి. ఎన్నికలకు ముందే  దళితులకు రూ. పది లక్షలు పంచాలని.. అదీ కూడా రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో తెలంగాణ అధికార పార్టీకి ఇబ్బందులు ప్రారంభమయ్యేలా కనిపిస్తున్నాయి. 


ఈ చిక్కుముడికి కేసీఆర్ వద్ద ఉన్న మంత్రం ఏమిటి..? 
 
ఇప్పటికే రూ. లక్ష కోట్లయినా దళితుల కోసం పంచుతామని కేసీఆర్ ప్రకటించారు. అది కేవలం.. దళితులకు మాత్రమే. కేసీఆర్ ఎక్కడో చోట లక్ష కోట్లను తెచ్చి దళిత వర్గాలకు ఇస్తే.. మిగతా ప్రజలు అసంతృప్తికి గురవుతారు. పేదరికానికి కులం ఉండదు. అందుకే ప్రభుత్వ లబ్ది అందని ఇతర వర్గాలు అసంతృప్తికి గురవుతాయి. అప్పుడు అందరికీ రూ. పది లక్షలు పంపిణీ చేయడం అసాధ్యం. కానీ అలాంటి పరిస్థితి లేదని ఆర్థిక నిపుణులకూ తెలుసు. ఆ మాత్రం లెక్కలు తెలియకుండా కేసీఆర్ రాజకీయం చేయరని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. అన్నింటికీ కేసీఆర్ వద్ద మంత్రం ఉంటుందని అంటున్నారు. విపక్షాలు చేస్తున్న ఈ ప్రచారానికి ఆయన ఏ మంత్రం రెడీ చేస్తారో చూడాలి..!