Political Crisis in Bihar: నితీశ్ కుమార్ యూటర్న్‌పై (Nitish Kumar) కాంగ్రెస్ కన్‌ఫ్యూజన్‌లో పడిపోయింది. బీజేపీని ఢీకొట్టాలని ఏర్పాటు చేసిన I.N.D.I.A కూటమి భవిష్యత్‌పైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది. సీట్ల పంపకాల్లో విభేదాల కారణంగా చీలికలు వస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. దీనిపై స్పందించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. ఈ విభేదాలన్నింటినీ పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా ఉండేలా తమ వంతు ప్రయత్నాలు తాము చేస్తున్నామని వెల్లడించారు. జేడీయూ కూటమి నుంచి బయటకు వెళ్లిపోతోందన్న వార్తలపైనా స్పందించారు. అలాంటి సమాచారమేమీ లేదని స్పష్టం చేశారు. అయితే...నితీశ్ కుమార్ మహాఘట్‌బంధన్‌ నుంచి తప్పుకుంటే ఆయనతో పాటు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో చేయి కలిపే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతోంది. ఇప్పటికే నితీశ్ కుమార్‌కి ఈ విషయమై లేఖ రాశానని, ఆయనతో మాట్లాడడానికీ ప్రయత్నించానని ఖర్గే తెలిపారు. 


"నితీశ్ మనసులో ఏముందో తెలియదు. నేను ఢిల్లీకి వెళ్లి అన్ని వివరాలూ కనుక్కుంటాను. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. కానీ కూటమిలోని అన్ని పార్టీలనూ కలిసికట్టుగా ఉంచేలా మా వంతు ప్రయత్నం మేం చేస్తూనే ఉన్నాం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు సీపీఐ(ఎమ్) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరితోనూ మాట్లాడుతున్నాం. అంతా కలిసి ఉంటేనే లోక్‌సభ ఎన్నికల్లో గట్టిగా పోరాటం చేయగలం అని నచ్చచెప్పాను. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి మేమంతా కలిసి ఉండాల్సిన అవసరముంది" 


- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 


కొంత కాలంగా కూటమిలో ఈ లుకలుకలు బయట పడుతూనే ఉన్నాయి. వీలైనంత వరకూ ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. నితీశ్ కుమార్‌తో మాట్లాడేందుకు ఖర్గే రెండు మూడుసార్లు ప్రయత్నించారని, కానీ ఆయన బిజీగా ఉన్నారని వెల్లడించారు.





అటు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ఈ వివాదంపై స్పందించారు. సీట్‌ల షేరింగ్ సమస్యని రాష్ట్రాల వారీగా పరిష్కరిస్తూ వస్తున్నామని వివరించారు. ఒక్కో రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కో రకంగా ఉన్నాయని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలకు ప్రతిపక్షాలన్నీ హాజరవుతాయని స్పష్టం చేశారు.