Donald Trump Attacked: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. పెన్సిల్వేనియాలో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తుండగా దుండగులు కాల్పులు జరిపారు. ఆయన వెంటనే అప్రమత్తమై ఆ కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన సెక్యూరిటీ అలెర్ట్ అయి ఆయనను ఆ వేదిక నుంచి సురక్షితంగా కార్‌లోకి తీసుకెళ్లింది. ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తుండగా ఉన్నట్టుండి కాల్పులు జరిగాయి. ఆ తూటాల నుంచి తప్పించుకునేందుకు ఆయన వెంటనే కిందకు వంగారు. ఈ లోగా సెక్యూరిటీ అప్రమత్తమై ఆయనను రక్షించింది. అయితే..ఈ కాల్పుల తరవాత ట్రంప్ తన కుడి చెవిని పట్టుకున్నారు. ఓ బులెట్ ఆయన చెవి నుంచి దూసుకుపోయి గాయమైంది. రక్తస్రావమూ అయింది. ఈ ఘటనతో ర్యాలీకి వచ్చిన వాళ్లంతా షాక్‌కి గురయ్యారు. ఏం జరుగుతోందో అర్థం కాక కేకలు పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ దాడిలో ట్రంప్‌కి ఎలాంటి హాని జరగలేదని, ఆయన బాగానే ఉన్నారని అధికారులు వెల్లడించారు. తక్షణమే స్పందించి తన ప్రాణాన్ని కాపాడిన సెక్యూరిటీకి ట్రంప్ థాంక్స్ చెప్పినట్టు ఆయన మద్దతుదారులు తెలిపారు. ప్రస్తుతానికి ఆయన వైద్యం అందిస్తున్నట్టు వివరించారు. అయితే..యూఎస్ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం ఇద్దరు దుండగులు ఈ కాల్పులు జరిపారు. వీరిలో ఒకరిని సెక్యూరిటీ మట్టుబెట్టింది. ఓ నిందితుడు రక్తపు మడుగులో కనిపించాడని మీడియా తెలిపింది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఆయన సురక్షితంగా ఉన్నాడన్న వార్త తెలిసి కాస్త ఊపిరి పీల్చుకున్నానని, పూర్తి వివరాల కోసం వేచి చూడాలని X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
మరి కొద్ది నెలల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్ జోరు పెంచారు. బైడెన్‌ని గద్దె దించాలన్న పట్టుదలతో ఉన్నారు. ప్రచారమూ ముమ్మరం చేశారు. సరిగ్గా ఈ సమయంలో ఆయనపై ఇలా కాల్పులు జరగడం కలకలం సృష్టించింది. ఈ ఘటనతో అమెరికా అంతా హైఅలెర్ట్ ప్రకటించారు. ఇప్పటికే ఈ కేసుని FBI విచారిస్తోంది. అతి తక్కువ దూరం నుంచే దుండగులు కాల్పులు జరిపినట్టు తేలింది.
Also Read: Trump Shooting: రాజకీయాల్లో హింసకు తావు లేదు, ట్రంప్‌పై కాల్పుల ఘటనపై ప్రధాని మోదీ అసహనం