Trump imposes 50 percent tariff: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిక్కకు లెక్క లేకుండా పోతోంది. కోపం వచ్చిన ప్రతి దేశంపై టారిఫ్‌లతో విరుచుకుపడుతున్నారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు ఆపేది లేదని ఇండియా చెప్పడంతో కోపగించుకున్న ఆయన మరోసారి పాతిక శాతం టారిఫ్ పెంచుతున్నట్లుగా ప్రకటించారు. దీంతో టారిఫ్ మొత్తం యాభై శాతం అయింది.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు చేస్తున్నందున భారత ఉత్పత్తులపై అదనపు 25 శాతం సుంకం విధిస్తున్నట్లుగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం పెట్టారు. ఆగస్టు 7, 2025 నుంచి అమలులోకి వస్తుంది. సెప్టెంబర్ 17, 2025 వరకు కొన్ని మినహాయింపులు ఉంటాయి. తాజా ఆదేశాల ప్రకారం యూఎస్‌లోకి దిగుమతి అయ్యే భారత ఉత్పత్తులపై అదనపు 25 శాతం అడ్ వాలోరెమ్ (వస్తువు విలువ ఆధారంగా) సుంకం విధిస్తారు. ఈ సుంకం ఆగస్టు 26, 2025 (ఆర్డర్ జారీ తర్వాత 21 రోజులు) రాత్రి 12:01 గంటల నుంచి అమలులోకి వస్తుంది. ఆగస్టు 26, 2025 రాత్రి 12:01 గంటల కంటే ముందు ఓడలో లోడ్ చేసి యూఎస్‌కు రవాణా అవుతున్న వస్తువులకు ఈ సుంకం వర్తించదు. సెప్టెంబర్ 17, 2025 రాత్రి 12:01 గంటల కంటే ముందు దిగుమతి కోసం లేదా గిడ్డంగుల నుంచి వినియోగం కోసం తరలించిన వస్తువులకు కూడా మినహాయింపు ఉంటుంది.
భారతదేశం 2024లో రష్యా నుంచి 70 శాతం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంది. ప్రపంచంలోనే అత్యధికంగా రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలలో రెండవ స్థానంలో భారత్ ఉంది. మొదటి స్థానంలో చైనా ఉంది. రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన తర్వాత, భారతదేశం రష్యన్ చమురు దిగుమతులను గణనీయంగా పెంచింది, 2023లో రోజుకు 1.8 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుంది. ట్రంప్ భారతదేశం సుంకాలను "ప్రపంచంలోనే అత్యధికమైనవి"గా విమర్శిస్తున్నారు. తాజా సుంకాలతో ఫార్మాస్యూటికల్స్, రత్నాలు, దుస్తులు, స్మార్ట్‌ఫోన్ తయారీ వంటి భారత ఎగుమతి రంగాలను ప్రభావితం చేయవచ్చు. యూఎస్‌కు భారత్ 12వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు అమెరికాలో భారంగా మారనున్నాయి. ప్రత్యామ్నాయం లేకపోతే అమెరికన్ ప్రజలు భారీ మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది.