PM Modi China Visit For SCO Summit: భారత్ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని పన్నుల పేరుతో బెదిరిస్తున్న ట్రంప్‌కు షాకిచ్చిందేకు ప్రధాని మోదీ రెడీ అయ్యారు. ఇప్పటికే రష్యాతో స్నేహం వదులుకునేది లేదని ఇండియా స్పష్టం చేసింది. ఇప్పుడు చైనాతోనూ సన్నిహితమవుతోంది.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్‌సీఓ సమ్మిట్ కోసం చైనాకు వెళ్లనున్నారు.  గల్వాన్ ఘర్షణ తర్వాత మొదటి  సారి భారత ప్రధానమంత్రి బీజింగ్ యాత్రకు వెళ్తున్నారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1, 2025 వరకు చైనాలోని టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమ్మిట్‌లో పాల్గొనేందుకు చైనా సందర్శించనున్నారు. ఇది 2020 జూన్‌లో గల్వాన్ లోయలో భారత ,  చైనా సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత మొదటి  పర్యటన. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు ,  కనీసం నలుగురు చైనా సైనికులు మరణించారు, దీని తర్వాత భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మోదీ పర్యటన ఈ సందర్శన రెండు దేశాల మధ్య సంబంధాలలో మెరుగుదలకు సూచన అనుకోవచ్చు. 

2020 జూన్ 15న లడఖ్‌లోని గల్వాన్ లోయలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ) వెంబడి భారత, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ 45 సంవత్సరాలలో రెండు దేశాల మధ్య మొదటి  తీవ్ర ఉద్రిక్త ఘటనగా నిలిచింది. ఈ ఘర్షణలో భారత్ 20 మంది సైనికులను కోల్పోగా, చైనా అధికారికంగా నలుగురు సైనికుల మరణాన్ని ధృవీకరించింది. ఈ సంఘటన ద్వైపాక్షిక సంబంధాలను చారిత్రక కనిష్ఠ స్థాయికి దిగజార్చింది, దీని ఫలితంగా భారత్ చైనా యాప్‌లపై నిషేధం, పెట్టుబడులపై కఠిన నియంత్రణలు,  రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల రద్దు వంటి చర్యలు తీసుకుంది. 

ఈ ఘర్షణ తర్వాత, రెండు దేశాలు ఎల్‌ఏసీ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించేందుకు పలు దఫాల సైనిక, దౌత్యపరమైన చర్చలు జరిపాయి. 2024 అక్టోబర్‌లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్‌లో ప్రధానమంత్రి మోదీ,  చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య జరిగిన సంక్షిప్త సమావేశం ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి అవకాశంగా మారిందది.  ఈ సమావేశంలో, ఎల్‌ఏసీ వెంబడి మిగిలిన ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రతినిధుల (ఎస్‌ఆర్) సంభాషణలను పునఃప్రారంభించాలని నిర్ణయించారు. 

ఎస్‌సీఓ సమ్మిట్, భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాన్,   ఇతర సభ్య దేశాల నాయకులను ఒక వేదికపై తీసుకొస్తుంది, ఇది ఉగ్రవాదం, వాణిజ్యం, కనెక్టివిటీ,  ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. మోదీ ఈ సమ్మిట్‌లో పాల్గొనడం ద్వారా, ఉగ్రవాదంపై భారత్   గట్టి వైఖరిని, ముఖ్యంగా సరిహద్దు దాటిన ఉగ్రవాదంపై దృష్టి సారించనున్నారు. ఈ సమ్మిట్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంటి నాయకులతో మోదీ ఒకే వేదికను పంచుకోనున్నారు. 

పుతిన్‌తో కూడా కరచాలనం

SCO సమ్మిట్‌లో మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా షేక్ హ్యాండ్ చేయనున్నారు. అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా భారత్‌ వెనక్కు తగ్గడం లేదు. 25 శాతం టారిఫ్‌తో పాటు రష్యా నుంచి ఆయిల్ కొంటే పెనాల్టీ వేస్తామని ట్రంప్ హెచ్చరించారు.. అయినా భారత్ వెనక్కు తగ్గలేదు. రష్యాతో చమురు మైత్రి దశాబ్దాల నుంచీ కొనసాగుతోందని.. దానిని వదులుకోబోమని చెప్పింది. ఇప్పుడు షాంఘైలో మరోసారి పుతిన్‌ను కలిసి అమెరికాకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని భారత్ అనుకుంటోంది. ( అయితే ట్రంప్ భారత కాలమాన ప్రకారం బుధవారం సాయంత్రం మరో 25శాతం టాక్సులు పెంచుతున్నట్లు ప్రకటించారు.)

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ జూలై 13-15, 2025లో చైనా సందర్శించి, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌లతో సమావేశమై, ఎస్‌సీఓ సమ్మిట్‌కు మార్గం సుగమం చేశారు. జైశంకర్ ఈ సందర్శనలో, 2024 అక్టోబర్‌లో మోదీ-జీ సమావేశం తర్వాత ద్వైపాక్షిక సంబంధాలలో కనిపిస్తున్న మెరుగుదలను కొనసాగించాలని, కైలాస్ మానససరోవర యాత్ర పునఃప్రారంభం వంటి సానుకూల చర్యలను స్వాగతించారు