Gaya airport code GAY: జంధ్యాల సినిమాల్లోని కొన్ని క్యారెక్టర్లు విచిత్రంగా ఉంటాయి. వారి పేర్లు కూడా. వారి పేర్లను షార్ట్ కట్ లో పలికి విచిత్రమైన అర్థాలు వచ్చేస్తాయి. అలాంటి పరిస్థితి నిజంగానే కొంత మంది వ్యక్తులకు, ఊళ్లకు వస్తాయి. బీహార్ లోని గయ ప్రాంతానికి కూడా అలాంటి పరిస్థితే వచ్చింది.
దేశంలో ఇటీవలి కాలంలో విమానాశ్రయాలను విస్తృతంగా నిర్మిస్తున్నారు. బీహార్ లోని గయ ప్రాంతంలోనూ ఓ ఎయిర్ పోర్టు నిర్మించి ప్రారంభించారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం IATA కోడ్ 'GAY'గా నిర్దారించారు . దీంతో పెద్ద కామెడీ అయిపోయింది. ఈ విషయాన్ని ఓ బీహార్ ఎంపీ భీమ్ సింగ్ పార్లమెంట్ లో లేవనెత్తారు. ఎగతాళి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అభ్యంతరకరంగా, అసౌకర్యంగా ఉందని రాజ్యసభలో ప్రశ్నించారు. ఈ కోడ్‌ను మరింత గౌరవప్రదమైన , సాంస్కృతికంగా సముచితమైన కోడ్‌గా మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తోందా అని కూడా ఆయన అడిగారు.
దీనికి పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ రాజ్యసభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, అంతర్జాతీయ విమానయాన సంఘం (IATA) విమానాశ్రయాలను గుర్తించడానికి మూడు-అక్షరాల కోడ్‌లను కేటాయిస్తుంది. ఈ కోడ్‌లు విమానాశ్రయం ఉన్న స్థలం పేరులోని మొదటి మూడు అక్షరాల ఆధారంగా సాధారణంగా నిర్ణయిస్తారు. గయా విమానాశ్రయం విషయంలో, 'GAY' కోడ్ ఈ విధానం ప్రకారం కేటాయించారు. IATA రిజల్యూషన్ 763 ప్రకారం, ఒకసారి కేటాయించిన మూడు-అక్షరాల కోడ్‌లు శాశ్వతంగా పరిగణిస్తారు. వీటిని మార్చడం అసాధారణ పరిస్థితుల్లో అదీ కూడా విమాన భద్రతకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. గతంలో గయా విమానాశ్రయం కోడ్ మార్పు కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ , ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అభ్యర్థనలు వచ్చాయని, అయితే IATA ఈ అభ్యర్థనలను తిరస్కరించిందని ఆయన తెలిపారు. ఎయిర్ ఇండియా కూడా ఈ కోడ్ మార్చాలని IATAను కోరింది, కానీ IATA నిబంధనల ప్రకారం మార్పు సాధ్యం కాదని తేల్చిచెప్పింది.
ఈ కోడ్‌లు ప్రధానంగా వాణిజ్య విమాన కార్యకలాపాల కోసం ఉపయోగిస్తారని.. విమాన సంస్థల అభ్యర్థన మేరకు కేటాయిస్తారని మంత్రి స్పష్టం చేశారు. గయా విమానాశ్రయం కోడ్ 'GAY' అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రయాణ సంబంధిత వ్యవస్థలు , ప్రక్రియలలో విమానాశ్రయాన్ని గుర్తించడానికి సహాయపడుతుందన్నారు. అంటే గయ ఎయిర్ పోర్టు కోడ్ గేగా ఖరారు అయినట్లే అనుకోవచ్చు.