YCP alleges attack on YCP MLC Ramesh Yadav in Pulivendula: పులివెందుల మండలంలోని నల్లగండ్ల వారి పాలెం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి జరిగిందని వైసీపీ ఆరోపించింది. ఎన్నికల ప్రచారానికి ఆ గ్రామానికి వెళ్లిన వారిపై రాళ్ల దాడి చేశారని ఆరోపించింది. రమేష్ యాదవ్ కు చెందిన రేంజ్ రోవర్ కారు అద్దాలు పగిలిపోయాయి. తమకు గాయాలయ్యాయని రమేష్ రెడ్డితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్తిగా బరిలో నిలబడిన మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు.
ఈ ఘటనను వైసీపీ నేతుల తీవ్రంగా ఖండించారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయాన్ని వైసీపీ నేతలు ముట్టడించారు. దాడి చేసిన వారిపై చర్యుల తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో వైపు పులివెందులలోనూ వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అవినాష్ రెడ్డి నేతృత్వంలో టీడీపీ దాడులకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి జరిగిందని తెలియగానే డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందులకు వచ్చి పరిస్థితిని ఆరా తీస్తున్నారు.
పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి కంచుకోట. అక్కడి గ్రామాల్లో వైసీపీకే మొగ్గు ఉంటుంది. టీడీపీకి చెందిన వారు పెద్దగా ఉండరు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం అయింది.
ఈ సారి మాత్రం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య లతారెడ్డి పోటీ చేస్తున్నారు. గతంలో పోటీ చేయలేని పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. నేరుగా గ్రామాల్లోకి వెళ్లగలుగుతున్నారు. గతంలో వైసీపీ తప్ప ఇతర పార్టీల నేతలు ఎవరూ గ్రామాల్లోకి వెళ్లగలిగేవారు కాదు. కూటమికి చెందిన కడప జిల్లా నేతలు సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి వంటి వారు గ్రామాల్లోకి వెళ్లి పార్టీలోకి చేరికను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో బీటెక్ రవి పలువుర్నీ పార్టీలోకి చేర్చుతున్నారు.
పార్టీలో చేరే మండల స్థాయి నేతలను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి పార్టీ కండువా కప్పుతున్నారు. జోరుగా చేరికలు సాగుతూండటంతో.. వైసీపీకి గడ్డు పరిస్థితి ఎదురవుతుందని ప్రచారం జరుగుతోంది. వైఎస్ కుటుంబం గతంలోలా ఏకతాటిపైన లేకపోవడంతో పాటు కాంగ్రెస్ తరపున షర్మిల అనుచరుడు పోటీ చేస్తూండటంతో .. వైసీపీకి సమస్యగా మారింది. ఎప్పుడూ లేని విధంగా పులివెందులలోవైసీపీ ఎమ్మెల్సీగా దాడి చెప్పుకోవడం .. వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే ఉంది. అయితే వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ దాడి ఘటనపై టీడీపీ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.