Tripura Election 2023:


ప్రశాంతంగా పోలింగ్..


త్రిపురలో పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే రెండు రౌండ్లు పూర్తయ్యాయి. 13%కిపైగా ఓటు శాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ఈ సారి కూడా విజయం తమదే అన్న ధీమాతో ఉన్నాయి పార్టీ శ్రేణులు. ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి మాణిక్ సాహా....ప్రజలు మరోసారి బీజేపీకే పట్టం కడతారని అన్నారు. దాదాపు 30 ఏళ్ల పాటు CPM పాలనలో ఉన్న త్రిపురలో...2018లో అధికారం మారిపోయింది. అసలు అక్కడ ఉనికే లేని బీజేపీ ఆ ఎన్నికల్లో పోటీ చేసింది. అయినా...60 సీట్లలో 36 చోట్ల విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్‌కు ఎక్కువగానే సీట్లు వచ్చినప్పటికీ Indigenous Progressive Front of Tripura (IPFT)తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే..పూర్వ వైభవం కోసం ప్రయత్నం చేస్తున్న CPM ఈ సారి కాంగ్రెస్‌తో కలిసి పోటీలోకి దిగింది. అంతకు ముందు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన మాణిక్ సర్కార్‌తో విస్తృతంగా ప్రచారం చేయించింది. మొత్తం 60 సీట్లలో 47 చోట్ల CPM పోటీ చేయగా...మిగతా 13 చోట్ల కాంగ్రెస్‌కు అవకాశమిచ్చింది. 2018లో CPM 18 సీట్లు మాత్రమే సాధించింది. అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ ఒక్క చోట కూడా గెలవలేదు. అందుకే ఈ సారి సీపీఎంతో కలిసి ఎన్నికల బరిలోకి దిగింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే..కేరళలో CPM, కాంగ్రెస్ ప్యత్యర్థులుగా ఉంటే...త్రిపురలో మాత్రం ఈ సీన్ అంతా మారిపోయింది. 










బీజేపీ హామీలు..


ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించాలని చూస్తున్న బీజేపీ ఓటర్లపై హామీల వర్షం కురిపించింది. అనుకూల్ చంద్ర స్కీమ్‌లో భాగంగా రూ.5 కే అందరికీ భోజనం అందిస్తామని హామీ ఇచ్చారు జేపీ నడ్డా. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు అభివృద్ధి విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. ఈ సారి మేనిఫెస్టోలో మరెన్నో ఆసక్తికరమైన అంశాలు చేర్చామని, అవన్నీ అభివృద్ధికి తోడ్పడేవే అని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని మోదీ ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి చూపుతారని చెప్పిన నడ్డా...యువతను వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. మేనిఫెస్టోని ఉద్దేశిస్తూ "ఇది కేవలం కాగితం కాదు. ప్రజల పట్ల మాకున్న నిబద్ధతకు నిదర్శనం" అని తేల్చి చెప్పారు నడ్డా. ఒకప్పుడు త్రిపుర పేరు చెబితే హింసాత్మక వాతావరణమే గుర్తొచ్చేదని... ఇప్పుడు ఈ రాష్ట్రం శాంతి, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని అన్నారు.


Also Read: Tax Saving Tips: సెక్షన్ 80C మాత్రమే కాదు, ఇవి కూడా పన్ను ఆదా మార్గాలే - ₹4 లక్షల వరకు మిగులు