Punjab CM TS Tour: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఈరోజు తెలంగాణకు రాబోతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ తోపాటు తొగుటలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టును సందర్శించనున్నారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి గురించి అడిగి తెలుసుకుంటారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ తో పాటు గజ్వేల్ పాండవుల చెరువు, నర్సన్నపేట చెక్ డ్యాంలను పరిశీలించనున్నారు. పంజాబ్ సీఎం పర్యటన నేపథ్యంలో ఆ రాష్ట్ర ఇరిగేషన్, వ్యవసాయ శాఖల అధికారులు మంగళవారమే ఆయా ప్రాంతాలను సందర్శించారు. పంజాబ్ సీఎం పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదంయ 10 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి కొండపోచమ్మ సాగర్ కు బయలుదేరుతారు. రోడ్డు మార్గంలో 11 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు.
ముందుగా కొండపోచమ్మ సాగర్ పరిశీలన
11 గంటల నుంచి 11.30 గంటల వరకు కొండపోచమ్మ సాగర్ ను, పంప్ హౌస్ ను సందర్శిస్తారు. అనంతరం 11.40 గంటలకు ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల మధ్యనున్న చెక్ డ్యాంను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.25 గంటలకు గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువుకు చేరుకొని మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధిని పరిశీలిస్తారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ కు వెళ్తారు. బుధవారం రోజు హైదరాబాద్ చేరుకున్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్... సీఎం కేసీఆర్ ను కలిశారు. సీఎం పర్యటనలో భాగంగా ఆయనతో పాటు రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, గజ్వేల్ హరిరామ్ ఈ పర్యటనలో పాల్గొనబోతున్నారు. ఆయా ప్రాజెక్టుల గురించి పంజాబ్ బృందానికి వివరించనున్నారు. అంతేకాదండోయ్ పంజాబ్ సీఎంతో పాటు ఆ రాష్ట్ర సీఎంఓ కార్యాలయ ఐఏఎస్ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొంటారు.