Greater Tipraland Demand:
ససేమిరా..
త్రిపురలో మరోసారి బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. మాణిక్ సాహా రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే IPFT పార్టీ ఓ విషయంలో ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. తిప్రాలాండ్, గ్రేటర్ తిప్రాలాండ్ డిమాండ్‌లకు తలొగ్గేదే లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తిప్రా మోథ పార్టీ అధినేత ప్రద్యోత్ కిషోర్ దెబ్బర్మాను కలిశారు. ఈ ఉన్నత స్థాయి సమావేశం తరవాత మాణిక్ సాహా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ తిప్రాలాండ్ డిమాండ్‌ను నెరవేర్చదని మరోసారి స్పష్టం చేశారు. 60 సీట్లున్న త్రిపురలో 13 చోట్ల విజయం సాధించి సెకండ్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది తిప్రా మోథ పార్టీ. అప్పటి నుంచి తిప్రా లాండ్ డిమాండ్‌ను వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో మాణిక్ సాహా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
"గిరిజనుల సంక్షేమంపైనే చర్చించాం. వాళ్ల సామాజిక ఆర్థిక స్థితిగతులను ఎలా మెరుగు పరచాలో చర్చలు జరిపాం. బీజేపీ నేతృత్వంలోని త్రిపుర ప్రభుత్వం 2023 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకుని పని చేస్తుంది. వాటిని నెరవేర్చేందుకు కృషి చేస్తుంది. గిరిజనుల సమస్యలను చర్చించేందుకు ప్రత్యేకంగా ఓ మధ్యవర్తిని నియమించాలన్న ఆలోచన ఏమీ చేయడం లేదు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు"
మాణిక్ సాహా, త్రిపుర ముఖ్యమంత్రి
లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం మాదే: మాణిక్ సాహా
2024 లోక్‌సభ ఎన్నికల గురించీ ప్రస్తావించిన మాణిక్ సాహా...త్రిపురలోనే కాకుండా ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ బీజేపీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్న విశ్వాసముందని స్పష్టం చేశారు. మునుపటి కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే కొంత మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసినా వారికి ఇంకా శాఖల కేటాయింపులు జరగలేదు. త్వరలోనే ఈ పని పూర్తి చేస్తామని వెల్లడించారు మాణిక్ సాహా. ఎన్నికల ఫలితాల తరవాత కొన్ని చోట్ల ఆందోళనలు జరిగాయి. వాటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రాష్ట్రానికి మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు.