Kavitha Comments :  11వ తేదీన  విచారణకు వస్తానని ఈడీకి సమాచారం ఇచ్చానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమను కాకుండా నిరుద్యోగాన్ని, ధరల పెరుగుదలను టార్గెట్ చేయాలని సూచించారు.  తెలంగాణలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. 9న రావాలని ఈడీ తన నోటీసుల్లో ఆదేశిచిందని.. వేరే పనుల వల్ల 11వ తేదీన  వస్తానని చెప్పానన్నారు. ఐటీ, ఈడీ, సీబీఐ పేరుతో  బెదిరిపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. నోటీసు ఇచ్చిన తర్వాత రెండు రోజుల సమయం అయినా ఇవ్వరా అని ప్రశ్నించారు. ఈడీ దర్యాప్తునకు వంద శాతం సహకరిస్తానన్నారు. తన ఇంటికే వచ్చి విచారణ చేయాలని కోరామని.. కావాలంటే నిందితుల్ని కూడా ఇంటికే తీసుకు వచ్చి ప్రశ్నించమని చెప్పామన్నారు. కానీ ఈడీ అంగీకరించలేదన్నారు. మహిళలను ఇంటిలో విచారించాలనే నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. 


ముందు ప్రధాని  వెనుక అదానీ ఉన్నారని అందరికీ తెలుసని.. మోదీకి తాను భయపడనని బీజేపీ కుట్రలను ఎదుర్కొంటానని కవిత ధీమా వ్యక్తం చేశారు. మోదీ వన్ నేషన్ వన్ ఫ్రెండ్ అనే కొత్త స్కీమ్ తెచ్చారన్నారు. మద్యం కుంభకోణంపై దర్యాప్తునకు అంత తొందర ఎందుకని ప్రశ్నించారు. మోదీ ఎన్ని కుట్రలు చేసినా చివరికి ధర్మమే గెలుస్తుందని... న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని ప్రకటించారు. ఇది నా ఒక్క సమస్య మాత్రమే కాదని.. మా పార్టీ నేతలు 15-16 మందిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విరుచుకుపడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించారని.. అది సాధ్యం కాకపోవడంతోనే తనను టార్గెట్ చేశారని కవిత ఆరోపించారు.  ఈ కుట్రన్నింటినీ రాజకీయంగా  ఢీ కొడతామమన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రయత్నించిన కేసులో బీఎల్ సంతోష్ విచారణకు ఎందుకు భయపడుతున్నారని కవిత ప్రశ్నించారు. 


ఈ ఏడాది చివరి వరకు తెలంగాణలో ఎన్నికలున్నాయని..అందుకే ప్రధాని మోడీ తమను టార్గెట్ చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు ఉన్నా మోడీ వచ్చే ముందు ఈడీ రావడం కామన్ అని చెప్పారు. అందుకే తమను భయపెట్టేందుకే బీజేపీ ప్రభుత్వం ఈడీని తమపై ప్రయోగించిందన్నారు. తనను మాత్రమే కాదు..తనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నేతలు సహా 15 మందిని బీజేపీ ప్రభుత్వం విచారణ పేరుతో వేధిస్తోందన్నారు.  బీజేపీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తులు చేయడం లేదన్నారు. ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరగానే.. వారిపై విచారణలు ఆగిపోతున్నాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎవరికీ బీ టీమ్ కాదని.. తమది ఎప్పటికీ ఏ టీమేనని కవిత స్పష్టం చేశారు. తన తండ్రి , సోదరుడి మద్దతే కాదని.. బీఆర్ఎస్ పార్టీ మొత్తం తనకు సపోర్టుగా ఉందని కవిత స్పష్టం చేశారు. 



విపక్షాలన్నీ ఐక్యంగా పోరాటం చేయడం లేదన్న అంశంపై జాతీయ మీడియా ప్రశ్నకు కవిత భిన్నంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ముందుగా తమ అహంకారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ఆ పార్టీ వల్లనే విపక్షాల ఐక్యత లేదని విమర్శించారు.