PV Narasimha Rao : భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు దేశంలోనిపలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి.. ఆయనతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారినప్పుడు పీవీ నరసింహారావు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంపై ప్రశంసలు గుప్పించారు.


ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చిన దార్శనికుడు
 
తెలంగాణ బిడ్డ, బహు భాషాకోవిదుడు, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సరళీకృత ఆర్థిక విధానాలతో సంస్కరణలకు బీజం వేసి దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చిన దార్శనికుడని కొనియాడారు.






ఆయన నాయకత్వంలో, 1991లో అప్పటి ఆర్థికమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పరివర్తనాత్మక ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చారు. అది ఆధునిక భారతదేశ ఆర్థిక పునరుజ్జీవనానికి పునాది వేసిందని కాంగ్రెస్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.






దేశ గతిని మార్చిన సంస్కరణలు


సంస్కరణలతో సంక్షోభ కాలాన్ని జయించి, దేశాన్ని ముందుకు నడిపించిన పాలనా సమర్థులు పీవీ నరసింహారావు అని ఆంధ్రప్రేదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా తెలిపారు. దేశ ప్రధానిగా ఆయన అమలు చేసిన సంస్కరణలు దేశ గతిని మార్చాయని, పీవీ వర్ధంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులర్పిస్తున్నానన్నారు.






తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణం


ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు గారు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ పోస్ట్ లో రాశారు. గడ్డు కాలంలో దేశానికి ప్రధానిగా సేవలందించిన పీవీ.. ఆర్థిక సంక్షోభం నుండి దేశాన్ని కాపాడి, తన పాలనతో ఆధునిక భారతానికి బాటలు వేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పీవీ నరసింహా రావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ గారి పేరు పెట్టామని చెప్పారు. పీవీ నరసింహా రావుకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపిందని.. ఆ తర్వాత పీవీ కూతురిని ఎమ్మెల్సీగా గౌరవించిందని తెలిపారు.





బహు భాషాకోవిదుడు పీవీ నరసింహారావు


అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన పీవీ.. పండితుడిగా, రాజనీతిజ్ఞుడిగా, బహుభాషావేత్తగా, రచయితగా పేరు తెచ్చుకున్నారు. 1972లో పార్లమెంటుకు ఎన్నికై.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో 1980 నుండి 1984 వరకు విదేశాంగ మంత్రితో సహా అనేక క్యాబినెట్ పదవులను నిర్వహించారు. ఆయన్ను చాలా మంది "రాజకీయ చాణక్య"గా అభివర్ణిస్తారు. దేశ చరిత్రలోనే మొదటిసారి గాంధీ, నెహ్రూ కుటుంబం నుంచి కాకుండా ఒక తెలుగువాడిగా పీవీ పేరు తెచ్చుకున్నారు. దేశంలో రాజకీయ అనిశ్చితి ఉన్నప్పటికీ 5 ఏళ్లు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రభుత్వం నడిపించిన వ్యక్తి పీవీ. 


Also Read : PV Sindhu Wedding: ఘనంగా పీవీ సింధు వివాహం, ఉదయ్‌పూర్‌లో వెంకట దత్తసాయితో ఏడడుగులు వేసిన స్టార్ షట్లర్