Traffic Signals in China's Desert: ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడ ఉంటాయ్..? ఇదేం వింత ప్రశ్న అనిపిస్తుంది కదా. కానీ ఈ ప్రశ్నలో వింతేమీ లేదు. ఎందుకంటే...రోడ్లపైనే కాదు. ఎడారుల్లోనూ ట్రాఫిక్ సిగ్నల్స్‌ ఉంటాయి. నిజమే. ఎడారిలో రోడ్లే ఉండవు అక్కడ సిగ్నల్స్ (Traffic Signals in Desert) ఎందుకన్న అనుమానం రావచ్చు. కానీ..ఇక్కడ సిగ్నల్స్ పెట్టింది వాహనాల కోసం కాదు. ఒంటెల కోసం. మన పొరుగున ఉన్న చైనాలోనే చూడొచ్చు ఈ వింతని. చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో Dunhuang సిటీలో ఎడారి మధ్యలో ఇలా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ఒంటెల వల్ల విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతోందని అధికారులు ఇలా ప్లాన్ చేశారు. ఈ భూమి మీద ఒంటెల కోసం ఇలాంటి ఏర్పాటు చేసిన తొలి దేశంగా రికార్డుకెక్కింది డ్రాగన్ దేశం. ఇంతకీ ట్రాఫిక్ జామ్ అయ్యేంతగా ఒంటెలు ఎందుకు వస్తున్నాయి..? ఏంటీ కథ..?


ఎందుకీ సిగ్నల్స్..?


చైనాలోని దున్‌హౌంగ్‌లో Mingsha Mountain చాలా ఫేమస్. దీన్నే సింగింగ్ శాండ్ డ్యూన్స్ (Singing Sand Dunes) అని పిలుస్తారు. చైనాలో ఉన్న టూరిస్ట్‌ ప్లేస్‌లలో ఇదీ ఒకటి. ఓటా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తుంటారు. అయితే...ఈ మౌంటేన్ వద్దకు చేరుకోవాలంటే ఒంటెలే దిక్కు. పైగా...ఇలా ఒంటె సవారీ చేస్తే కానీ ఆ మజా ఉండదంటారు స్థానికులు. ఒంటెలపైన ఎక్కి కూర్చుని ప్రయాణిస్తేనే టూర్‌ని ఎంజాయ్ చేయొచ్చని చెబుతుంటారు. అందుకే పర్యాటకులు ఇలా Camel Ride చేస్తున్నారు. ఒకేసారి ఇంత మంది వచ్చిన కారణంగా వందల సంఖ్యలో ఒంటెలు వరుస కట్టాయి. ఎడారిలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని సార్లు ఒంటెలు ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటున్నాయి. ఇదంతా చాలా గందరగోళం సృష్టిస్తోంది. పైగా ప్రయాణికులూ అసౌకర్యానికి గురవుతున్నారు. అందుకే అక్కడి ప్రభుత్వం ఈ కొత్త ఐడియాతో ముందుకొచ్చింది. ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఓ క్రమ పద్ధతిలో ఒంటెలు వెళ్లేలా ఎడారి మధ్యలో అక్కడక్కడా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసింది. 2021లోనే ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. కాకపోతే ఇప్పుడిప్పుడే అది వెలుగులోకి రావడం వల్ల ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. 


ట్రాఫిక్‌ ఫికర్ లేదు..


సాధారణంగా ట్రాఫిక్‌ సిగ్నల్స్‌లో ఏ కలర్స్ అయితే ఉంటాయో అవే ఇందులోనూ ఉంటాయి. రెడ్ సిగ్నల్ పడితే ఒంటెలు ఆగిపోవాలి. గ్రీన్ సిగ్నల్‌ పడిందంటే ముందుకు వెళ్లిపోవాలి. ఇలా చేయడం వల్ల చాలా వరకూ ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోయాయని చెబుతున్నారు అధికారులు. 1990 ల నుంచే దున్‌హౌంగ్‌ సిటీ టూరిస్ట్ అట్రాక్షన్‌గా ఉంది. 2023లో దాదాపు 37లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చారు. వాళ్లలో 42% మంది ఒంటెలపైన ప్రయాణించేందుకే ఆసక్తి చూపించారు. నిజానికి లోకల్‌గా ఇదో పెద్ద బిజినెస్. స్థానిక గ్రామస్థులు ఈ ఒంటె సవారీ కోసం ఒక్క ట్రిప్ కోసం ఒక్కో ప్రయాణికుడి నుంచి 100 యువాన్‌లు వసూలు చేస్తారు. అంటే మన కరెన్సీలో రూ.1,100. స్థానికంగా కనీసం 2 వేల ఒంటెలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. 


Also Read: Italy's Birth Rate: దయచేసి పిల్లల్ని కనండి, దేశాన్ని కాపాడుకోండి - ఇటలీ పౌరులకు పోప్ విజ్ఞప్తి