Italy's Demographic Crisis: పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) ఇటలీ ప్రజలను పిల్లల్ని కనాలని సూచించారు. దేశంలో వృద్ధుల జనాభా పెరిగిపోతోందని, దయచేసి పిల్లల్ని కనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా రోజులుగా ఆయన దీనిపై ప్రచారం కూడా చేస్తున్నారు. ఇటలీలో జనన రేటు మరీ దారుణంగా పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే (Italy's birth rate) చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. యువ జనాభా లేకపోతే దేశానికి భవిష్యత్‌ అంటూ ఉండదని తేల్చి చెప్పారు. ఏ దేశంలో అయినా పురోగతికి ఇదే కీలకమని స్పష్టం చేశారు. ఈ సమస్య కేవలం ఇటలీకే పరిమితం కాలేదు. మొత్తం ఐరోపా అంతా యువ జనాభా తగ్గిపోతోందని అంటున్నారు పోప్ ఫ్రాన్సిస్. 


"ప్రజల్లో దేశం పట్ల ఎంత విశ్వాసం ఉందో చెప్పేది జనన రేటు మాత్రమే. యువ జనాభా లేకపోతే ఆ దేశ భవిష్యత్‌ ప్రమాదంలో పడినట్టే. అందుకే అందరూ కచ్చితంగా పిల్లల్ని కనండి. మన దేశానికి యువ జనాభా ఎంతో అవసరం. అన్ని ప్రభుత్వాలు ఈ సమస్యపై దృష్టి సారించాల్సిన అవసరముంది"


- పోప్ ఫ్రాన్సిస్


ఇటలీలో ఎందుకీ సమస్య..?


ప్రపంచంలోనే అతి తక్కువ జనన రేటు ఉన్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది ఇటలీ. దాదాపు 15 ఏళ్లుగా అక్కడ బర్త్ రేట్‌ పడిపోతోంది. గతేడాది 3 లక్షల 79 వేల మంది మాత్రమే జన్మించారు. 15 ఏళ్లలో ఇదే అత్యంత తక్కువ. చాలా మంది గర్భనిరోధక పద్ధతుల్ని అనుసరిస్తుండడం వల్ల జనన రేటు దారుణంగా తగ్గిపోయింది. అటు వృద్ధుల జనాభా పెరిగిపోతుంటే ఇటు యువతీ యువకుల జనాభా పడిపోతోంది. అందుకే పోప్ అంతగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 


"ఓ ఎక్స్‌పర్ట్ నాతో ఓ విషయం చెప్పాడు. ప్రస్తుతం అధిక ఆదాయం వచ్చేవి రెండే రెండు మార్గాల్లో అని వివరించాడు. ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీల్లో ఎంత పెట్టుబడితే అంతకు రెట్టింపు లాభం వస్తోందట. ఇదే విధంగా గర్భనిరోధక మాత్రలతో పాటు ఇతరత్రా మందుల తయారీ రంగంలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తున్నాయట. ఇళ్లలో పిల్లలు లేకపోతే చాలా వెలితిగా ఉంటుంది. ఇప్పుడు దేశంలో కుక్కలకు, పిల్లులలు కొదవ లేదు. పిల్లలే లేకుండా పోయారు"


- పోప్ ఫ్రాన్సిస్  


విధానాల్లో మార్పు రావాలి..


వర్క్ పాలసీలు కఠినంగా ఉండడం వల్ల మహిళలు పిల్లల్ని కనేందుకు వెనకాడుతున్నారని పోప్ వివరించారు. పిల్లల్ని పెంచాలా..? పని చేసుకోవాలా అన్న సందిగ్దంలో పడిపోతున్నారని అన్నారు. అందుకే ప్రభుత్వం ఈ సమస్యని దృష్టిలో పెట్టుకుని పాలసీల్లో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. జంటలు ఆనందంగా జీవించేలా, వాళ్లు కుటుంబ బాధ్యతని భారం అనుకోకుండా ఉండేలా విధానాలు తీసుకురావాలని సూచించారు. 


Also Read: అవును కాంగ్రెస్ కొన్ని తప్పులు చేసింది, పార్టీ వైఖరి మారాలి - రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు