Election campaign End Today In Andhra Pradesh And Telangana :తెలుగు రాష్ట్రాల్లో గత రెండు నెల రోజులుగా మారుమోగుతున్న మైకులు మూగబోనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హోరెత్తిన ప్రచారం... ముగింపు దశకు చేరుకుంది. ర్యాలీలు, సభలు, అభిమాన నేతలను కీర్తిస్తూ పాడిన పాటలు, నినాదాలు... సాయంత్రం 6గంటల తర్వాత ఇక వినిపించవు. ఏపీ, తెలంగాణలో... ఎన్నికల ప్రచారానికి ఇవాళే చివరి రోజు కావడం... సాయంత్రం 6గంటల వరకే ప్రచారానికి గడువు ఉండటంతో... రాజకీయ పార్టీల నేతలు చివరి ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రచారానికి ఇంకొన్ని గంటలే సమయం ఉండటంతో... ఓటర్ల దగ్గరకు వెళ్లి... తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. సాయంత్రం లోపే ప్రచారం ముగించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నాలుగో దశ పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లోనూ ఈ సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి గడువు ముగుస్తుంది.
సాయంత్రం 6గంటల తర్వాత సభలు, సమావేశాలు పెట్టకూడదని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు... ప్రచార సమయం ముగిసిన తర్వాత స్థానికేతరులు నియోజకవర్గాల్లో ఉండేందుకు వీలులేదని ఆదేశించారు. ప్రచారం కోసం బయటి నుంచి నియోజకవర్గాలకు వచ్చిన వారంతా వెళ్లిపోవాలని తెలిపింది. రాజకీయ పార్టీలు నియమించుకున్న రాష్ట్ర ఇంఛార్జ్‌లు.. పార్టీ కార్యాలయాల్లోనే ఉండాలి. ఆఫీసు దాటి బయటకు రావొద్దని ఈసీ స్పష్టం చేసింది. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 6గంటలకు ప్రచారం ముగుస్తుండగా... సమస్యాత్మక ప్రాంతాలైన పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో అయితే సాయంత్రం 5గంటలకే ప్రచారానికి సమయం ఇచ్చారు. అలాగే... అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటలకే ప్రచారం పూర్తవుతుంది. నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎల్లుండి (మే 13) పోలింగ్ జరగనుంది. ఇక.. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు కూడా అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఇక రెండు రోజులే సమయం ఉంది. దాదాపు రెండు నెలలు... ప్రచారంతో ఊదరగొట్టాయి రాజకీయ పార్టీలు. ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటూ మాటల యుద్ధానికి దిగారు. తమను గెలిపిస్తే ఏమేం చేస్తామని... ఓటర్లకు వివరంగా చెప్పాయి. ఇక... సాయంత్రం 6గంటల తర్వాత.. ప్రచారం ముగుస్తుంది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు వాదనలు, వాగ్దానాలు.. హామీలు.. చేసిన పనులు, చేస్తామన్న పనులు అన్నీ విన్న ఓటర్లు... ఎవరికి ఓటు వేయాలో ఆలోచించుకునేందుకు... సమయం ఉండాలనే ఈసీ... రెండు రోజులు సమయం ఇస్తుంది. ఓటర్లు బాగా ఆలోచించుకుని సరైన అభ్యర్థికి ఓటు వేయాలనే ఉద్దేశంతో... సైలెన్స్ పీరియడ్ తెచ్చింది. ఈరోజు సాయంత్రం నుంచి... పోలింగ్ ముగిసే వరకు ఉన్న 48గంటల సమయం... సైలెన్స్ పీరియడ్ అమల్లో ఉంటుందని తెలిపింది ఎన్నికల కమిషన్.
ఈ 48 గంటల సయమంలో... ఓటర్లను ఏ విధంగానూ ప్రలోభాలాలకు గురిచేయకుండా ఈసీ చర్యలు తీసుకుంటోంది. బల్క్ మెసేజ్‌లపై నిషేధం విధించింది. సినిమా, టెలివిజన్ లేదా.. మరేదైన మార్గం ద్వారాను ప్రచారం నిర్వహించకూడదని స్పష్టంగా తెలిపింది. ఎన్నికల ప్రచారం ముగియడమే కాదు.. మద్యం షాపులను కూడా సాయంత్రం 6గంటల నుంచి మూసివేస్తున్నారు. ఈనెల 13న పోలింగ్ ఉండటంతో... 14వ తేదీనే మద్యం షాపులు తెరుస్తున్నారు.