Kejriwal Election Campaign: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్లిన అరవింద్ కేజ్రీవాల్ మొత్తానికి (Kejriwal Election Campaign) మధ్యంతర బెయిల్ మీద విడుదలయ్యారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన విడుదల కావడం ఆప్ కార్యకర్తల్తో జోష్ నింపింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ కూడా గట్టిగానే ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. మరో 21 రోజుల పాటు ఆయనకు బెయిల్‌కి అనుమతి ఉంది. ఇవాళ (ఏప్రిల్ 11) భారీ రోడ్ షోకి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. నియంతపాలన నుంచి దేశాన్ని కాపాడుకోవాలంటూ ఇప్పటికే ఆయన ప్రచార నినాదాన్ని వినిపించారు. ఢిల్లీలోని కన్నౌట్ ప్లేస్ నుంచి కేజ్రీవాల్ రోడ్‌షో ప్రారంభమవుతుందని పార్టీ వెల్లడించింది. అక్కడ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు కేజ్రీవాల్. అక్కడి నుంచే ప్రచారం మొదలైంది.
ఆ తరవాత పార్టీ ఆఫీస్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మే 13న నాలుగో విడత పోలింగ్ జరగనుంది. అయితే...ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలకు మే 25న ఎన్నికలు జరగనున్నాయి. కేజ్రీవాల్ బయటకు రావడంపై కేవలం ఆప్ నేతలే కాదు. I.N.D.I.A కూటమి నేతలూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజాయతీకి దక్కిన విజయం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించారు. నిజాన్ని ఎవరూ ఎప్పటికీ ఓడించలేరని స్పష్టం చేశారు.
"నిజాయతీ ఉన్న వ్యక్తుల్ని ఇబ్బందిపెట్టగలరేమో కానీ ఓడించలేరు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేం స్వాగతిస్తున్నాం. నియంతృత్వానికి త్వరలోనే శుభం కార్డు పడుతుంది. సత్యమేవ జయతే"
- సంజయ్ సింగ్, ఆప్ రాజ్యసభ ఎంపీ
అటు కేంద్రహోం మంత్రి అమిత్ షా మాత్రం ఆప్‌కి చురకలు అంటించారు. ఇది శాశ్వత బెయిల్ కాదని, మధ్యంతర బెయిల్ మాత్రమే అని స్పష్టం చేశారు. ఆయన ఎంత ప్రచారం చేసినా ప్రజలు మాత్రం ఆయన చేసిన అవినీతిని మరిచిపోరని తేల్చి చెప్పారు.
"కేజ్రీవాల్‌కి ఇచ్చింది రెగ్యులర్ బెయిల్ కాదు. మధ్యంతర బెయిల్ మాత్రమే. ఆయన ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఆయన వెళ్లిన ప్రతి చోట ప్రజలు ఆయన చేసిన అవినీతిని గుర్తు చేసుకుంటారు"
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి