Republic Day 2023: గణతంత్ర దినోత్సవాలను విజయవాడలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఈ నెల 26వ తేదీన గణతంత్ర వేడుకలు నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టికె రాణా మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రిపబ్లిక్ డే రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. 


ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో బెంజి సర్కిల్ నుంచి ఆర్టీసీ వై జంక్షన్ వరకు.. రెడ్ సర్కిల్ నుంచి ఆర్టీఏ జంక్షన్ వరకు, శిఖామణి సెంటర్ నుంచి వెటర్నరీ జంక్షన్ వరకు ఎలాంటి వాహనాలను అనుమతి లేదని వెల్లడించారు. బెంజి సర్కిల్ నుంచి డీసీపీ బంగ్లా వరకు ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ప్రజల సౌకర్యార్థమే ఈ ఆంక్షలు విధించబోతున్నట్లు సీపీ వెల్లడించారు.


ఏ దారుల్లో వెళ్లాలంటే..?



  • ఆర్టీసీ వై జంక్షన్ నుంచి బెంజి సర్కిల్ రాకపోకలు సాగించే బస్సులు, ఇతర వాహనాలు ఏలూరు రోడ్డు, స్వర్ణ ప్యాలెస్, దీప్తి సెంటర్, పుష్పా హోటల్, జమ్మిచెట్టు సెంటర్, సిద్దార్థ జంక్షన్ మార్గాన బందరులాకులు, రాఘవయ్య పార్క్, పాత ఫైర్ స్టేషన్ రోడ్, అమెరికన్ ఆస్పత్రి, మసీద్ రోడ్, నేతాజీ బ్రిడ్జి, గీతా నగర్, స్క్యూ బ్రిడ్జి మార్గంలో వెళ్లాలని పోలీసు కమిషనర్ తెలిపారు. ఐదో నెంబర్ రూట్ లో ప్రయాణించే సిటీ బస్సులు ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు రింగ్ రోడ్డు నుండి బెంజి సర్కిల్ కు చేరుకోవాలని సూచించారు. 

  • హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు రాకపోకలు సాగించే భారీ, మధ్య తరహా వాహనాలు ఇబ్రహీంపట్నం, జి. కొండరూ, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మార్గాన్ని అనుసరించాలని తెలిపారు. 

  • విశాఖపట్నం నుంచి చెన్నైకి వెళ్లే పెద్ద వాహనాలు ఏవైనా హనుమాన్ జంక్షన్, గుడివాడ, పామర్రు, రేపల్లె, అవనిగడ్డ, చీరాల, త్రోవగుంట, బాపట్ల, ఒంగోలు మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది.

  • గుంటూరు నుంచి విశాఖపట్నానికి వెళ్లేవారు బుడంపాడు, తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూడి వంతెన, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మార్గంలో వెళ్లాలి.

  • చెన్నై నుంచి హైదరాబాద్ కు రాకపోకలు సాగించే వాహనాలు ఏవైనా మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్ పల్లి మార్గంలో హైదరాబాద్ కు చేరుకోవాలి. 


రిపబ్లిక్ డేకు వచ్చేవారి వాహనాల పార్కింగ్..



  • గణతంత్ర వేడుకలకు వచ్చే ఆహ్వానితులు వారి వాహనాలను పార్కింగ్ చేసేందుకు ప్రత్యేక స్థలాలను కేటాయించినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ తెలిపారు. 

  • 'అ' పాస్ లు కలిగిన వారు స్టేడియం గేట్-2 నుంచి లోపలికి ప్రవేశించి, అక్కడే వాహనాలు పార్క్ చేయాల్సి ఉంటుంది.

  • 'అ1', 'అ2' పాస్ లు ఉన్న వారు గేట్-4 నుంచి ప్రవేశించి హ్యాండ్ బాల్ గ్రౌండ్ వద్ద వాహనాలు పార్క్ చేసుకోవాలి.

  • 'ఆ1', 'ఆ2' పాస్ లు ఉన్న వారు గేట్-6 నుంచి ప్రవేశించి ఫుట్ బాల్ గ్రౌండ్ వద్ద, స్టేడియానికి ముందు ఉన్న ఆర్మ్ డ్ రిజర్వ్ గ్రౌండ్ వద్ద వాహనాలు పార్కు చేసుకోవాలి. 

  • మీడియా పర్సన్స్ గేట్-2 నుంచి స్టేడియంలోకి ప్రవేశించాలి.

  • సింగ్ నగర్, సత్యనారాయణ పురం, నున్న, మాచవరం వైపు నుంచి వచ్చే విద్యా సంస్థల బస్సులు సీతారామపురం జంక్షన్ మీదుగా వచ్చి పుష్పా హోటల్ వద్ద విద్యార్థులను దింపేసి వాహనాలను మధుచౌక్, జమ్మిచెట్టు, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ లో పార్కింగ్ చేసుకోవాలి.

  • పటమట వైపు నుంచి వచ్చే స్కూల్ బస్సులను వెటర్నరీ జంక్షన్ వద్ద విద్యార్థులను దింపేసి నేతాజీ బ్రిడ్జి, స్క్యూ బ్రిడ్జి, బెంజి సర్కిల్, నిర్మల జంక్షన్, పాలిక్లినిక్ రోడ్డు, సిద్ధార పబ్లిక్ స్కూల్ లో పార్క్ చేసుకోవాలి.  మిగతా రూట్లలో వచ్చే బస్సులు స్వరాజ్ మైదానంలో పార్క్ చేసుకోవాలి.